మన తెలంగాణ /సిటీ బ్యూరో: నాలాల సమగ్ర అభివృద్దితో నగర ముంపు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు. గురువారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద రూ. 12.86 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను ఎమ్మెల్యే లు మాగంటి గోపినాధ్, మాధవరం కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంతో నగరంలోని నాలాలకు మహర్దశ పట్టనున్నదన్నారు.
జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్ నియోజకవర్గాల పరిధిలో గల ఎజి కాలనీ నుండి సనత్ నగర్ వరకు 2,423 మీటర్లు మేర ఉన్ననాలాను ఇందులో మొదటి విడతలో 830 మీటర్ల మేర అభివృద్ధి పనులకు రూ. 12.36 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధులతో నాలా కు రిటైనింగ్ వాల్స్, బాక్స్ డ్రెయిన్ ల నిర్మాణం చేపట్టతున్నమని తెలిపారు. మొదటి విడతలో చేపట్టే నాలా అభివృద్ధి పనులతో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్, ఆనంద్ నగర్, ప్రేం నగర్, సుల్తాన్ నగర్, తదితర ప్రాంతాల ప్రజలు సుదీర్ఘ కాలంగా వరదనీటి ముంపుతో పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయని మంత్రి వెల్లడించారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కోట్లాది రూపాయల ఖర్చుతో సీవరేజ్ సమస్య పరిష్కారానికి పాత పైప్ లైన్ లను తొలగించి సామర్ద్యం పెంచడం, అవసరమైన చోట్ల నూతన పైప్ లైన్ల ఏర్పాట్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ రద్దీ అధిగమించేలా రహదారుల అభివృద్ధి, నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ షాహీనా బేగం, సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, ఎస్‌ఎన్‌డిపి సిఈ కిషన్, ఎస్‌ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.