Wednesday, December 25, 2024

జ్ఞానవాపిలో నమాజ్‌కు అనుమతి

- Advertisement -
- Advertisement -

శివలింగం లభించిన ప్రాంతానికి భద్రత : సుప్రీంకోర్టు ఆదేశాలు

శివలింగం ఎక్కడ లభించిందని ప్రశ్నించిన ధర్మాసనం
నివేదిక చూడలేదని చెప్పి బుధవారం వరకు గడువు కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా,విచారణ రేపటికి వాయిదా
మసీదు కాంప్లెక్స్ విడియో సర్వే బాధ్యతలు చూస్తున్న అజయ్ కుమార్ మిశ్రాను తొలగించిన వారాణాసి కోర్టు

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీ దు కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం లభించిన ప్రాంతానికి భద్రత కల్పించాలని, అయితే మసీదులో నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారాలను చూసే అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, పిఎస్ నరసింహలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. శివలింగం కచ్చితంగా ఎక్కడ లభించిందని విచారణ సందర్భంగా ధర్మాసనం యుపి ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. అయితే తాను నివేదికను ఇంకా చూడలేదని, వివరాలు తెలియజేయడానికి బుధవారం వరకు గడువు ఇవ్వాలని మెహతా చెప్పారు.

దీంతో శివలింగం లభించిన ప్రాంతాన్ని కాపాడాలని, అదే సమయంలో మసీదులో నమాజ్‌ను అనుమతించాలని ధర్మాసనం ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యతను వారణాసి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరినీ అనుమతించరాదని వారణాసి సివిల్ కోర్టు ఈ నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. శివలింగాన్ని కాపాడాలని దిగువ కోర్టు ఉత్తర్వులోని భాగాన్ని మాత్రం సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై వారణాసి కోర్టు ప్రొసీడింగ్స్‌పై సుప్రీం స్టే ఇవ్వలేదు.16వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడి ఆలయంలో కొంతత భాగాన్ని ఔరంగజేబు ఆదేశాలతో కూల్చి వేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారని వారణాసి కోర్టులో 1991లో పిటిషన్ దాఖలయింది. జ్ఞానవాపి మసీదులో ప్రార్థనలకు అనుమతించాలని పిటిషనర్లు, స్థానిక పూజారులు ఎప్పటినుంచో కోరుతున్నారు.

అడ్వకేట్ కమిషనర్‌ను తొలగించిన వారణాసి కోర్టు

అంతకు ముందు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియో సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అదే సమయంలో వీడియో సర్వే బాధ్యతలు చూస్తున్న కోర్టు కమిషనర్ అజయ్‌కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనను తొలగించింది. అంతేకాదు వీడియో సర్వే నివేదికను కమిషన్ ఇంకా కోర్టుకు సమర్పించక ముందే మీడియాకు వార్తలు లీక్ చేస్తున్నారన్న ఆరోపణపై సోమవారం కోర్టులో హిందూ పిటిషపర్లు, ప్రతివాదులు ముస్లిం తరఫు న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అజయ్ మిశ్రాను ఆ బాధ్యతలనుంచి తప్పించింది. మరో వైపు నివేదిక సమర్పించడానికి రెండు రోజులు సమయం కావాలని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు రెండు రోజులు గడువు ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News