చెన్నై : పొంగల్ సందర్భంగా ఏటా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టుకు కరోనా ఆంక్షలతో తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా భద్రతాపరమైన జాగ్రత్తలను సూచించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారు మాత్రమే ఎద్దును పట్టుకోడానికి ఈ క్రీడలో పాల్గొనాలని, అలాగే 48 గంటల ముందుగా ఆర్టీ పీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకోవాలని, కరోనా నెగిటివ్ రిపోర్టు కలిగి ఉండాలని ఆంక్షలు విధించింది. ఎద్దు యజమాని, శిక్షకుడు మాత్రమే రిజిస్ట్రేషన్ సందర్భంగా అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ క్రీడలు జరిగే ఆరుబయలు ప్రదేశంలో 50 శాతం సీటింగ్ సామర్ధం, లేదా 150 మంది ప్రేక్షకులు మాత్రమే ఉండాలని సూచించింది. పాల్గొనే ప్రేక్షకులు రెండు రోజులు ముందుగా పూర్తిగా వ్యాక్సినేషన్ పొందినట్టు సర్టిఫికెట్, ఆర్‌టి పిసిఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని పేర్కొంది. జల్లికట్టు, మంజువిరట్టు, వాడమడు క్రీడలకు 300 మంది రైతులు మాత్రమే పాల్గొనడానికి అనుమతించింది.