పాట్నా : బీహార్‌లోని జమూయి జిల్లాలోని బంగారు గనులలో తవ్వకాలకు అనుమతిని ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే అతి భారీ స్థాయి బంగారు నిక్షేపాలున్న ప్రాంతంగా జమూయి రిజర్వ్ ప్రాంతానికి గుర్తింపు ఉంది. ఇక్కడ బంగారం అన్వేషణ విషయంలో నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఈ బంగారు నిక్షేపాల ప్రాంతంలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు, ఇక్కడనే 37.6 మిలియన్ టన్నుల ఖనిజ సంసన్న ఇనుము ఉన్నట్లు గతంలో జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) గుర్తించింది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని ఇప్పుడు ఇక్కడ బంగారం నిల్వలకు తవ్వకాలపై పూర్తిస్థాయిలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి) ఇతర నిపుణుల బృందాలతో సంప్రదింపులు జరిపినట్లు బీహార్ మైన్స్ కమిషనర్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి హర్జోత్ కౌర్ బంహారా తెలిపారు.