అమరావతి: స్కిల్ స్కామ్ జరగలేదని మాత్రం టిడిపి నేతలు చెప్పడంలేదని మంత్రి పేర్ని నాని చురకలంటించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. లంచాలు తీసుకున్న ఇద్దరూ విదేశాలకు పారిపోయారని, మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాపాల భైరవుడు అని మండిపడ్డారు. రూ.371 కోట్ల స్కామ్‌పై మౌనంగానే ఉంటారా? అని పవన్ ను నిలదీశారు. చంద్రబాబుకు జనసేన అధినేత కూలీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. 1977 నుంచి చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు, ఎంతో అవినీతికి పాల్పడ్డాడని, బాబు తన కుయుక్తులు, నక్క జిత్తులతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పాడని, పాపం ఎల్లకాలం నిలబడదని నాని విమర్శించారు.
45 ఏళ్లు ఎన్నో స్కామ్‌లు చేస్తూ స్టేలు తెచ్చుకుంటూ బాబు మేనేజ్ చేశాడని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని, ఎంత గడ్డి కరిచేందుకైనా బాబు దిగజారుతున్నారని నాని ధ్వజమెత్తారు. బాబు స్కామ్‌లో తీగ మాత్రమే కదిలిందని, ఇంకా డొంక కదలాల్సి ఉందని, బాబును కాపాడుకోవాలనే లక్ష్యంగా పవన్, సిపిఐ పని చేస్తుందని ఎండగట్టారు. సిఐడి, పోలీసులు చంద్రబాబు ఎంతో మర్యాద ఇచ్చారని, ఎల్లో మీడియా మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోందని, సిఐడి విచారణలో ఏమో తెలియదు, మరిచిపోయా అనే సమాధానం బాబు చెప్పారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విషయంలో సిఐడి అన్ని నిబంధనలూ పాటించిందని ఆయన స్పష్టం చేశారు.