ఫేస్‌బుక్ ఫేం జుకర్ వివరాలు కూడా
న్యూయార్క్ : ఫేస్‌బుక్ యుజర్లలో 50 కోట్ల మందికిపైగా వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయి. ఇవి హ్యాకర్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా ఏళ్లుగా జరుగుతోన్న తంతు అయింది. అయితే ఈ పరిణామంపై ఇటీవల గోప్యతా పరిరక్షణ బాధ్యతలకు సంబంధించి ఫేస్‌బుక్ , ఇతర సామాజిక మాధ్యమాలు అత్యంత కీలక సమాచారం సేకరించాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ యుజర్ల సమాచారం వెల్లడి కావడాన్ని మరింతగా నిర్థారించుకున్నారు. 106 దేశాలకు చెందిన వారి వివరాలు వారి ఫోన్‌నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడిలు, జన్మస్థలాలు, వారుండే ప్రాంతాలు చివరికి ఇ మొయిల్ ఐడిలు వంటి పూర్తి సమాచారం తమకు ఇతరత్రా లభ్యం అయిందని బిజినెస్ ఇన్‌సైడర్ పత్రిక తెలిపింది.
రెండు మూడేళ్ల క్రితమే ఉక్రెయిన్ భద్రతా విషయాల పర్యవేక్షకులు తెలిపిన వివరాల మేరకు 26 కోట్ల మంది ఫేస్‌బుక్ యుజర్ల వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతబడ్డాయి. వీరిలో పలువురు ప్రముఖ ఐటి కంపెనీల దిగ్గజాలు, ఇతర రంగాలకు చెందిన వారి వివరాలు కూడా ఉన్నట్లు పసికట్టారు. ఇప్పుడు సమాచారం లీక్ అయిన వారి సంఖ్య 50 కోట్లు దాటినట్లు స్పష్టం అయింది. ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు, ఐటి దిగ్గజం మార్క్ జుకర్‌బెర్గ్ వ్యక్తిగత సమాచారం కూడా హ్యాకింగ్ వెబ్‌సైట్‌లో ఉందని స్పష్టం అయింది.