Tuesday, December 24, 2024

వికలాంగులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: వికలాంగుల డిక్లరేషన్ సంఘం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని వికలాంగుల డిక్లరేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో మాదిరిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేసి, ప్రతి వికలాంగుల కుటుంబానికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. వైకల్య ధ్రువీకరణ పత్రం కలిగిన వికలాంగులకు ఆర్టీసీ, రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, 40 శాతం వైకల్యం కలిగిన వారందరికీ బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ నియామకల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంలో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం కేటాయించాలి. వివాహం కాని వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రత్యేక టీచర్లను నియమించి బదిరులు, అంధులు,శారీరక వికలాంగుల కోసం గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం ప్రత్యేక పాలసీ ప్రకటించాలన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజం , వినికిడి పరీక్షలు, మానసిక వైకల్యం కలిగిన పిల్లల కోసం ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడియాలజిస్టులను నియమించాలి. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 25 వేల ప్రత్యేక చెల్లించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎం అడివయ్యా, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లేపల్లి స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి శశికళ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News