Monday, January 20, 2025

బుకర్ జాబితాలో ‘పైర్’

- Advertisement -
- Advertisement -

రచయితగా చచ్చిపోయాను’ అని పెరుమాళ్ మురుగన్ ప్రకటించిన ఎనిమిదేళ్ళ తరువాత ఆయన రాసిన ‘పైర్’ నవల అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పరిశీలన దీర్ఘ జాబితాలో చోటు సంపాదించింది. ఈ తమిళ రచయిత 2013లో రాసిన ‘పైర్’(చితి) నవలను అనిరుధన్ వాసుదేవన్ తమిళం నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. ఈ నవలలోని కథాంశం 1980 ప్రాంతంనాటిది. తమిళనాడు గ్రామీణ ప్రాంతంలోని భిన్న కులాలకు చెందిన ఒక యువతి యువకుడు ప్రేమలో పడి ఊరు విడిచిపారిపోవడంతో హింస చెలరేగుతుంది. ‘అధికారం, వేళ్ళూనుకున్న కులం, విద్వేషం, హింస వంటి శరీర నిర్మాణ గొప్ప శాస్త్రజ్ఞుడు పెరుమాళ్ మురుగన్’ అని బుకర్ ప్రైజ్ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బుకర్ ప్రైజ్ జాబితాకు చేరిన తొలి తమిళ నవల ‘పైర్’ సాహిత్య సృష్టిలో ఒక రచయితగా మురుగన్‌కు గుర్తింపు తేవడమే కాదు, తాను లోతైన అనుబంధాన్ని పెంచుకున్న తన మాతృభాష తమిళానికి కూడా గుర్తింపు లభించింది.

హిందీని ‘భారతీయ భాష’ గా గుర్తిస్తారు. తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, మరాటి, బెంగాలి, ఒరియా వంటి భాషల స్థాయిని తగ్గించడానికే వాటిని ‘ప్రాంతీయ భాషలు’గా గుర్తించారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషలలో తమిళం కూడా ఒకటన్న వాస్తవాన్ని ఈ రకమైన ‘భాషాధిక్యం’ తిరస్కరిస్తోందని పెరుమాళ్ మురుగన్ స్పష్టం చేశారు. తమిళ భాషను భారత దేశంతోపాటు శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో పది కోట్ల మంది మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ‘ఒక తమిళ నవల ఈ స్థాయికి చేరుకోవడం నాకు చాలా ఆనందదాయకం. తమిళ సాహిత్యానికి ఇదొక గుర్తింపు. ఈ నవల నాది అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను.’ అని ప్రకటించారు.

దారిద్య్రం, కులం, మహిళలు అణిగిమణిగి ఉండం వంటి విషయాలపైన మురుగన్ రాయడం హిందుత్వ వాదులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ అంశాలపై 2010లో రాసిన ‘వన్ పార్ట్ ఉమన్’ నవల వల్ల ఆ పరిణామాల చవి చూశారు. బిడ్డలు లేరని నిరాశగా ఉన్న ఒక మహిళకు సంబంధించిన కథ ఇది. ఏడాదిలో ఒక రోజు రాత్రి మహిళలు తమకు నచ్చిన కొత్త వ్యక్తితో గడిపే పండుగ గురించి మురుగన్ ఈ నవలలో వర్ణిస్తారు. మొదట్లో దీనిపైన ఎవ్వరూ పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. నాలుగేళ్ళ తరువాత, అంటే మోడీ ప్రధానిగా పదవి చేపట్టాక, గుడిని, సంప్రదాయాన్ని, మహిళల్ని మురుగన్ అవమానపరిచాడని హిందుత్వ వాదులు రెచ్చిపోయారు. ఆగ్రహావేశాలతో ఒక సమూహం మురుగన్ ఇంటి పైకి వచ్చి ఆయన్ని శిక్షించాలని ఆందోళన చేసింది. నరేంద్రమోడీ పాలనలో ఇలాంటివి సర్వసాధారణమైపోయాయి.

పది నవలలు, అయిదు కథా సంకలనాలు, నాలుగు కవితా సంకలనాలు అచ్చయిన ఒక సాహిత్యకారుడిగా నిలబడిన తరువాత ఉన్నట్టుంది తనని వెంటాడడం మొదలైందని మురుగున్ గమనించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో హిందుత్వ వాదులకు క్షమాపణలు చెప్పి ‘వన్ పార్ట్ ఉమన్’ నవల ప్రతులన్నిటినీ ఉపసంహరించుకున్నారు. ‘పెరుమాళ్ మురుగన్ అనే రచయిత మరణించాడు’ అని 2015 జనవరిలో ఫేస్‌బుక్‌లో ఆయన ప్రకటించారు. ఆయన చుట్టూ ఉన్న ఒక వర్గం వారు ఆయన గాయాన్ని మరింత తీవ్రంచేచారు. ఆయన ఎంతగా స్వీయ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే, ఆయన కాని, ఆయన భార్య, పిల్లలు కాని దాని గురించి మాట్లాడడానికి ఇప్పటికీ ఇష్టపడడం లేదు.

‘ఆ కాలంలో నా మనసు విప్పి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అలాంటి పరిస్థితి అది. అలాంటి పరిస్థితిని మళ్ళీ చూడదలుచుకోలేదు. ఇప్పటి ఆనంద క్షణాల గురించి మాట్లాడుకుందాం’ అని మురుగన్ అంటారిప్పుడు. పెరుమాళ్ మురుగన్ రచనల పైన విచారించాలని హిందుత్వ వాదులు పెట్టుకున్న పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించడంతో స్వీయ అజ్ఞాతం నుంచి 2016లో బైటికొచ్చి నిలబడ్డారు. ‘ఇప్పటికీ నాలో ఒక సెన్సార్ కూర్చునుంది. నానుంచి పుట్టిన ప్రతి పదాన్ని అది పరిశీలిస్తోంది’ అని ఢిల్లీలో ప్రజలతో మాట్లాడుతూ మురుగన్ అన్నారు. కులం వంటి సామాజిక రుగ్మతలను కనుగొనడంలో అతని ఆకాంక్ష ఏమాత్రం మారలేదు. కులం గురించి ప్రస్తావించకుండా భారతీయ సమాజం గురించి మాట్లాడడం అసాధ్యం.

‘వ్యక్తి గత స్వేచ్ఛకు, జీవితానికి కులం ఆటంకం. సహజంగా మానవ మాత్రులకు అవసరమైన వాటిని కులం అణచివేస్తుంది. వ్యక్తి స్వేచ్ఛను తొలగిస్తే మానవ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? భారతీయ సమాజం తగినంత అభివృద్ది చెందకపోవడానికి కులమే కారణం” అని మురుగన్ వివరించారు. ‘వన్ పార్ట్ ఉమన్’ రాసినందుకు తన ఇంటిని హిందూత్వ వాదులు చుట్టుముట్టినప్పటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత దిగజారిన విషయాన్ని గమనిస్తూ, మరింత జాగ్రత్తగా ఉన్నారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ దమననీతి చాలా బలంగా ఉన్న సమయం’ అని వ్యా ఖ్యానించారు. సామాజికంగా జరుగుతున్న మార్పులు ఆయన్ని గాయపరుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జీవితంలోని అన్ని విషయాలను అధ్యయనం చేయడానికి, కలిసి పనిచేయడానికి అవకాశాలు పెరిగాయి.

‘కులం, మత నమ్మకాలకు ఆజ్యం పోసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే శక్తులు సామాజిక మార్పును వ్యతిరేకిస్తున్నారు’ అని అంటారు మురుగన్. రాయడమే ఒక ఓదార్పు. ‘రాయడమే నా వరకు నాకు జీవితం..ప్రతిరోజూ నేను రాస్తూ ఉంటాను. అక్కడే నన్ను నేను దహనం చేసుకుంటాను. మరుసటి రోజు తాజాగా పుడతాను’ అంటారు ఈ రచయిత. ఒక నిరక్షరాస్యుడైన రైతు కుమారుడిగా ఒక గ్రామంలో మేకలు, గొర్రె పిల్లలతో పాటు పుట్టిన ఈ రచయితకు ప్రకృతే అనువైన మూలమైంది. ‘నేలతో, దానిలో ఉన్న పచ్చని పంటలతో సమారస్యం గల రైతును నేను. ఒక ఆవును, ఒక మేకను చూసి స్పందించే హృదయం నాది. రాయడం అనేది నా విశ్వసనీయమైన గొర్రెపిల్ల లాంటిది. దాన్ని నేను అనుసరిస్తాను.
(ద గార్డియన్ సౌజన్యతో…)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News