కరీంనగర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవితను తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాద్యాయులు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడికి ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి మాధవీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. స్థానిక దుర్గమ్మగడ్డకు చెందిన బాలిక కార్ఖానగడ్డలోని ఓ ప్రైవేట్ హైస్కూల్‌లో మూడోతరగతి చదువుతున్నది. విద్యార్థినిపై కన్నేసిన గోపి 2017 జూలై 25న సాయంత్రం పాఠశాల ముగియగానే ఆమెను రెండో అంతస్తుపైకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించగా అతడి నుంచి తప్పించుకున్నది. మరుసటిరోజు అలాగే ప్రవర్తించగా తల్లికి విషయం తెలిపింది. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ విజయ్‌కుమార్ దర్యాప్తు జరిపారు. ప్రాసిక్యూషన్ పక్షాన పిపి తిరుపతి సాక్షులను ప్రవేశపెట్టగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంగళ్‌దాస్ శ్రీనివాస్ విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు గోపికి జైలుశిక్ష, జరిమానా విధించారు. ఘటనకు నాలుగు నెలల ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన నీరటి గోపి (30) వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరాడు.