మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు నాగోల్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్‌టిసిలో ఉచిత పథకంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ఆర్‌టిసి బస్సు పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని, దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఉచిత పథకం వల్ల అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతోందన్నారు. అందుకే ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్‌టిసిపై భారం పడుతుందని, దీనిని ప్రభుత్వం భరించడం కూడా సరికాదన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం సరికాదన్నారు. పై విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత ప్రయాణాన్ని నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు.