మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బిజెపి మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా బిజెపి ఎంఎల్‌ఎలు రఘునందన్, రాజాసింగ్, ఈటల రవీందర్‌ల సస్పెషన్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో భారత రాష్ట్రపతిని కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. హైకోర్టులో పిటిషన్‌పై ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడుతూ హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గుర్తుచేశారు. శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరి ఉందని విమర్శలు గుప్పించారు. ఏ సెక్షన్ కింద బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గవర్నర్‌ను అవమానిస్తూ బల్లలు ఎక్కిన హరీష్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బిజెపి లేదన్నారు. బడ్జెట్ స్పీచ్‌లో రాజకీయ విమర్శలు చేసిన మంత్రిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ స్పీచ్‌ను ఉపయోగించుకోవటం దుర్మార్గమన్నారు. తమ స్థానంలో నిలబడి నిరసన చెప్పిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇచ్చిన పేపర్‌ను తలసాని సభలో చదివారన్నారు. పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్ గౌరవం పెరుగుతుందని తెలిపారు. ఏ సెక్షన్ కింద సస్పెషన్ చేశారో రాతపూర్వకంగా చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని అడిగితే నాలుగు రోజులు సమయం అడిగారని ఎంఎల్‌ఎ రఘనందనరావు పేర్కొన్నారు.
ఎంపి రఘురామ పిల్‌కు నంబర్ కేటాయించండి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపి రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి రాఘురామ 10 నెలల క్రితమే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు నెంబర్ ఇవ్వకపోవడంతో ఇంతవరకు విచారణకు రాలేదు. మరోసారి పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రఘురామ వేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇడి, సిబిఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కేసులు త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామ హైకోర్టుకు వెళ్లారు.
Petition in High Court over BJP MLAs Suspension