సుప్రీం, హైకోర్టులలో లాయర్ల పిటిషన్లు
న్యూఢిల్లీ : న్యాయస్థానాలలో మనిషికి భద్రతను అర్థిస్తూ ఈ మేరకు చర్యలను కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో శుక్రవారం నాటి కాల్పుల ఘటన, గ్యాంగ్‌స్టర్ ఇద్దరు ముఠా సభ్యుల మృతి నేపథ్యంలో ఈ పిటిషన్లకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రత్యేకించి సబార్డినేట్ కోర్టులలో భద్రతా ఏర్పాట్లు గురించి రాష్ట్రాలు, కేంద్రానికి తగు ఆదేశాలు వెలువరించాలని ఇద్దరు న్యాయవాదులు విశాల్ తివారీ, దీపా జోసెఫ్ న్యాయస్థానాలను వేడుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టులో విశాల్ తివారీ పిటిషన్ వేయగా, ఢిల్లీ హైకోర్టులో దీపా జోసెఫ్ తమ పిటిషన్ దాఖలు చేశారు. గ్యాంగ్‌స్టర్స్‌ను, కరుడుగట్టిన నేరస్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించడం మంచిదని, వారిని భౌతికంగా కోర్టులకు తీసుకువస్తే జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఇప్పటి ఘటనతో తేలిందని పిటిషనర్లు తెలిపారు. జడ్జి సమక్షంలోనే కోర్టు హాల్‌లో గ్యాంగ్‌వార్‌లో భాగంగా కాల్పుల ఘటన జరిగింది. ఇందులో కరడుగట్టిన నేరస్తుడు గోగిని ప్రత్యర్థి వర్గమైన టిల్లూ గ్యాంగ్ సభ్యులు లాయర్ల దుస్తులతో వచ్చి కాల్చిచంపారు.
తరువాత భద్రతా బృందం జరిపిన కాల్పుల్లో వీరు హతులు అయ్యారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఒకరైన విశాల్ తివారీ కోర్టులలో భద్రత గురించి ఇంతకు ముందుగానే పిటిషన్ వేశారు. అయితే ఇది విచారణకు రాకుండా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పిటిషన్‌లో విశాల్ ఇప్పటి తాజా సంఘటనను ప్రస్తావిస్తూ కోర్టులలో తక్షణ భద్రతా ఏర్పాట్ల గురించి ఆదేశాలు వెలువరించాలని అభ్యర్థించారు. కోర్టు హాళ్లలోనే కాల్పులు జరగడం, ఇతరత్రా దాడులు చెలరేగడం వంటి వాటితో కోర్టు సిబ్బందికి, లాయర్లకు ఈ దశలో కోర్టులో ఉండే ప్రతి ఒక్కరికి ప్రాణగండం ఏర్పడుతుందని, పైగా న్యాయ పంపిణీ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ అయిన లాయరు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన న్యాయమూర్తి ఆందోళన
ఢిల్లీ కోర్టులో ఘటన పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితిని తెస్తుందన్నారు. ఘటనపై ఆయన వెంటనే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూరిత డిఎన్ పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దిగువ స్థాయి కోర్టుల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్షకు ఆదేశించారు.
కాల్పుల ఘటన వీడియో
లాయర్లు జనం పరుగులు
సాధారణంగా పేరు మోసిన నేరస్తులను కోర్టులలో ప్రవేశపెట్టే దశలో జనం విపరీత సంఖ్యలో కోర్టులకు వస్తుంటారు. ఈ దశలో శత్రు బృందాలు పరిస్థితిని అనువుగా చేసుకునే వీలుంది. ఈ అంశం శుక్రవారం జరిగిన రోహిణి కోర్టు కాల్పుల ఘటనతో స్పష్టం అయింది. అక్కడ జరిగిన కాల్పుల ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉన్నట్లుండి కాల్పులు జరగడంతో లాయర్లు, పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పెద్ద పెట్టున కేకలు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కోర్టు సిబ్బంది, జడ్జి ఉన్న దశలోనే క్షణాలలోనే కాల్పులు జరగడం హాలు రక్తసిక్తం కావడం వంటి దృశ్యాలు ఇప్పుడు వీడియోలో కన్పించాయి.