Monday, December 23, 2024

బీహార్ కులగణన తీర్పుపై సుప్రీంలో పిటిషన్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు పాట్నా హైకోర్టు ఈనెల 1న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌జీవో “ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్‌” దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారించనున్నది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తుంది. ఈ పిటిషనే కాకుండా మరో పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో దాఖలైంది.

నలందాకు చెందిన అఖిలేశ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కులగణనకు సంబంధించి బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి జనాభా లెక్కలను నిర్వహించే సాధికారత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. “ ప్రస్తుత కేసులో బీహార్ రాష్ట్రం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారాలను లాక్కోడానికి చూస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్ ప్రభుత్వం ఎలాంటి అధికారిత, చట్టబద్ధత లేకుండా ఈ జనాభా లెక్కల సేకరణను చేపడుతోందని కుమార్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదేపదే ఇది జనాభా లెక్కల సేకరణ కాదని వివరిస్తున్నారు. ప్రజల ఆర్థిక స్థితి, వారి కులం వివరాలు మాత్రమే సేకరిస్తామని, తద్వారా వారికి మరింతగా సేవ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరిస్తున్నారు. పాట్నా హైకోర్టు తన 101 పేజీల తీర్పులో “ న్యాయంతో కూడిన అభివృద్ధిని అందించాలనే చట్టబద్ధమైన లక్షంతో ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య కచ్చితంగా, సమర్ధంగా ప్రారంభమౌతుందని ఆశిస్తున్నాం” అని పేర్కొంది.

బీహార్‌లో ఈ సర్వే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు ప్రకటించగానే మరునాడే బీహార్ ప్రభుత్వం ఈమేరకు కార్యాచరణ ప్రారంభించింది. ఇది వేగంగా పూర్తి చేయాలనే లక్షంతో టీచర్ల శిక్షణ కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ఈ ప్రక్రియలో మొదటి దశ జనవరి 21 నాటికే పూర్తయింది. ఈ కులగణన కోసం రూ. 500 కోట్లు వరకు బీహార్ ప్రభుత్వం వెచ్చించనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News