న్యూఢిల్లీ : సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మే 14న విచారించడానికి నిర్ణయించింది. ఓ పిటిషన్ తరుఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్… ఈ విషయంలో త్వరగా విచారణ జరపాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్‌భూయాన్‌లతో కూడిన ధర్మాసనం వచ్చే నెలలో విచారణకు తేదీని నిర్ణయించింది.
భూసేకరణతోపాటు అనేక ఇతర కీలకమైన కేసులను ఈ రోజు ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అయితే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ 2023లో కేంద్రం చట్టాన్ని తీసుకువచ్చింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టగా ఆమోదం పొందింది. కమిటీ నుంచి సీజేఐని తొలగిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి చోటు కల్పించడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.