Friday, December 27, 2024

పెట్రో డాలరు పతనావస్థ!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆయిల్ వ్యాపారంపై అమెరికన్ డాలర్ పట్టు కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రో డాలర్ కాంతి విహీనమయ్యే పరిస్థితి ఎంతో దూరం లేదనిపిస్తున్నది. అయితే దాని వల్ల డాలర్ బలహీనపడిపోయే ప్రమాదం తక్షణమే లేకపోయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌తో పాటు చైనా కరెన్సీ యువాన్ తదితర పలు దేశాల నాణేలకు ప్రాధాన్యం కలిగే అవకాశాలు లేకపోలేదు.వీలున్న ఇతర దేశాలతో రూపాయిల్లో సరకుల ఎగుమతి, దిగుమతులు జరపడానికి భారత దేశం ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఏడాది క్రితం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా మీద అమెరికా విధించిన ఆంక్షల వల్లనూ, డాలర్లలోనే కాకుండా ఇతర కరెన్సీలలోనూ ఆయిల్ ఎగుమతులు చేపట్టాలని సౌదీ అరేబియా సంకల్పించడం వల్లనూ పెట్రోల్ వ్యాపారంపై డాలర్ ప్రభావం సన్నగిల్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్ వ్యాపారం గత కొన్ని దశాబ్దాలుగా కేవలం డాలర్ ద్వారానే జరుగుతున్న సంగతి తెలిసిందే. బంగారం నిల్వలను బట్టి డాలర్ విలువను నిర్ణయించే విధానానికి అమెరికా స్వస్తి చెప్పి లోటు బడ్జెట్‌ల అవసరానికి ఇష్టం వచ్చినట్లు డాలర్లు ముద్రించడం మొదలైన తర్వాత సౌదీ అరేబియా పెట్రోలుపై అది దృష్టి పెట్టింది. దానితో సౌదీ వద్ద అమెరికన్ డాలర్లు పోగుపడడం ప్రారంభమైంది.

సౌదీ ఆయిల్‌ను కొనుగోలు చేయడానికి, అందుకు ప్రతిగా దానికి సైనిక సాయం అందించి ఆయుధాలు విక్రయించడానికి అమెరికా దానితో ఒప్పందం కుదుర్చుకొన్నది. అతిపెద్ద ఆయిల్ ఎగుమతి దేశమైనందున ఒపెక్ (ఆయిల్ ఎగుమతి దేశాల సంస్థ)పై సౌదీ పెత్తనం స్థిర పడింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా దేశ దేశాల ఆయిల్ కొనుగోళ్ళు డాలర్లలోనే జరగడం మొదలైంది. అది పెట్రో డాలర్ వ్యవస్థకు దారి తీసింది. రష్యాతో ఎటువంటి ఆర్థిక సంబంధాలు పెట్టుకోరాదని అమెరికా ఆంక్షలు విధించడంతో పెట్రో డాలర్ మీద గట్టి దెబ్బ పడింది. రష్యాపై తీవ్రమైన ఆంక్షల్లో భాగంగా మాస్కో నుంచి ఆయిల్ దిగుమతికి అమెరికా, యూరపు దేశాలు స్వస్తి చెప్పిన తర్వాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకొంటున్న ఇండియా సుళువైన షరతుల మీద రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నది. రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకోవలసి వస్తే అతి తక్కువ ధరకు మాత్రమే చేసుకోవాలని అమెరికా, యూరపు ఒక పరిమితిని విధించుకొన్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయడానికి దానినొక మార్గం చేసుకొన్నాయి.

దీనితో వాటికి సరఫరాలను నిలిపివేసి ఇండియాకు వీలైనంత ఎక్కువగా ఆయిల్‌ను అమ్మడం రష్యా ప్రారంభించింది. ఇండియా ఈ కొనుగోలును అమెరికన్ డాలర్లలో కాకుండా యుఎఐ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కరెన్సీ దిర్హాన్ లో కొంత మేరకు, ఎక్కువగా రష్యన్ రూబుళలో జరపడం మొదలుపెట్టింది. ఆ మేరకు పెట్రో డాలర్ అవసరం తొలగింది. ఇలా గత మూడు మాసాల్లో ఇండియా ఇతర కరెన్సీల్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆయిల్ విలువ కొన్ని వందల మిలియన్ డాలర్లు వుంటుందని వార్తలు చెబుతున్నాయి. ఒకప్పుడు డాలర్‌లో తప్ప వేరే కరెన్సీల్లో రష్యా నుంచి గాని, సౌదీ నుంచి గానీ ఇంకే ఒపెక్ దేశం నుంచి గాని పెట్రోల్ కొనడం సాధ్యం అయ్యేది కాదు. అటువంటిది ఇప్పుడు డాలరేతర కరెన్సీల్లో విశేషంగా పెట్రోల్ కొంటున్నారు. ఇది సాధారణమైన మార్పు కాదు.

ఏడాదికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందాన్ని టర్కీతో రష్యా కుదుర్చుకొన్నది. ఇందులో భాగంగా రష్యా నుంచి దిగుమతి చేసుకొనే గ్యాస్‌కు రూబుళ్ళలో చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు. అలాగే తమ దేశానికి వచ్చే రష్యన్ విహార యాత్రికులు రూబుళ్ళలో చెల్లించడానికి టర్కీ అవకాశం కల్పించింది. ఇదంతా విదేశీ మారక కరెన్సీగా డాలర్ పతనాన్నే సూచిస్తున్నది. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 59% కంటే తక్కువకి పడిపోడం గమనార్హం. అమెరికా తన దారికి రాని దేశాలపై కక్షతో అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది నానా బాధలు పడుతున్నారు. దీనితో ఆయా దేశాలు డాలరుకు దూరమయ్యాయి.

రష్యాపై ఆంక్షలతో ఇది మరింత పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డాలర్ పట్టు ఎన్నడూ లేనంతగా సడలిపోడానికి కారణమైంది. చైనాకు ఆయిల్ ఎగుమతులను యూవాన్‌లో జరపాలని యోచిస్తున్నట్టు సౌదీ అరేబియా గత సంవత్సరం ప్రకటించింది. కేవలం చైనా కరెన్సీలోనే కాకుండా ఇతర అనేక దేశాల కరెన్సీలలో ఆయిల్ ఎగుమతులను జరపడానికి సిద్ధంగా వున్నామని సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్ జడాన్ మొన్న జనవరిలో దావోస్‌లో ప్రకటించారు. ఇండియా, పాకిస్తాన్, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా రష్యా, చైనాల కరెన్సీల్లో చెల్లించి అక్కడి నుంచి దిగుమతులు చేసుకోడానికి ఒప్పందాలు కుదుర్చుకొన్నట్టు సమాచారం. అందుచేత ఏకైక అగ్ర రాజ్యంగా వెలుగుతున్న అమెరికా ముందు వెనుకలు చూసుకోకుండా తీసుకొనే నిర్ణయాలు దాని ఆధిపత్యానికి ఒకనాటికైనా గండి కొట్టవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News