మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పెట్రో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. అనుప్పూర్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ. 120 దాటేయగా డీజిల్ రూ. 110కు చేరువలో ఉంది. అదే విధంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రను ఆనుకుని ఉన్న బాలఘాట్‌లో లీటరు పెట్రోల్ రూ. 119.23 చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న అనుప్పూర్ జిల్లాలోని బిజూరి పట్టణంలో తాజాగా 36 పైసలు పెంపుదలతో లీటరు పెట్రోల్ ధర రూ. 120.4 చేరుకున్నట్లు అభిషేక్ జైశ్వాల్ అనే పెట్రోల్ పంపు యజమాని తెలిపారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో లీటరు డీజిల్ ధర రూ. 109.17 చేరుకుంది. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్‌పూర్ ఆయిల్ డిపో నుంచి అనుప్పూర్‌కు పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లు వస్తుండడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ రవాణా ఛార్జీలు ఎక్కువ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ. 116.62 ఉండగా డీజిల్ ధర రూ. 106.01 ఉంది.