న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు పెంపుదలతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 25 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 87.60కు చేరుకోగా మంబయిలో రూ.94.12కు చేరుకుంది. దేశ రాజధానిలో లీటరు డీజిల్ రూ. 77.73 ఉండగా ముంబయిలో రూ. 84.63కు పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. కాగా..రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించడానికి ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత ఏడాది తగ్గినప్పటికీ ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దరిమిలా ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఏడాది తర్వాత మొదటిసారి బ్యారెల్ ముడి చమురు ధర 61 అమెరికన్ డాలర్లు దాటిందని ఆయన తెలిపారు. పెట్రోల్ రిటెయిల్ అమ్మకం ధరపై 61 శాతం, డీజిల్‌పై సుమారు 56 శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటున్నాయి. మంగళవారం 30 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ. 3.89, డీజిల్‌పై రూ. 3.86 ధరలు పెరిగాయి.