Friday, November 15, 2024

పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: అధిక ధరలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ప్రభుత్వం గురువారం తెల్లారే సరికి పెట్రోధరల బాంబు పేల్చింది. చారిత్రక స్థాయిలో అత్యంత గరిష్ఠంగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం తెచ్చుకోవడం కోసం ఈ ధరలను వివరీతంగా పెంచివేసింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ. 170 బిలియన్లను ఆర్జించేందుకు ప్రతిపాదించిన మినీ బడ్జెట్‌ను పార్లమెంటుకు బుధవారం సమర్పించిన తరువాత బుధవారం అర్ధరాత్రి దాటాక పెట్రోధరల బాంబును విడిచిపెట్టింది.

గత నెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ. 35 చొప్పున ధరలు పెంచిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా లీటర్ పెట్రోలుపై రూ.22.20 (పాకిస్థాన్ కరెన్సీ) పెంచినట్టు తెలియజేసింది. ఈమేరకు లీటరు పెట్రోలు ధర రూ. 272కు చేరగా, హైస్పీడ్ డీజిల్ ధరను లీటరుకు రూ.17.20 చొప్పున పెంచడంతో హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.280 వంతున చేరింది.

కిరోసిన్ ధరను లీటరుకు రూ.12.90 వంతున పెంచడంతో లీటరు కిరోసిన్ ధర రూ.202.73 కు చేరింది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలు లోకి వస్తాయని ప్రకటనలో పేర్కొంది. రెవెన్యూను పెంచుకోవాలని ఐఎంఎఫ్ చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు 10 రోజుల పాటు పాకిస్థాన్, ఐఎంఎఫ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 7 బిలియన్ డాలర్ల రుణంలో 1.1 బిలియన్ డాలర్లను విడుదల చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవలసిందేనని ఐఎంఎఫ్ చెప్పడంతో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మినీ ఆర్థిక బిల్లును ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రతిపాదించారు. డాలర్‌తో పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసర సరకుల ధరలు పాకిస్థాన్‌లో చుక్కలనంటాయి. లీటర్ పాల ధర రూ. 210, కిలో చికెన్ ధర రూ.700 నుంచి రూ. 800 వరకు పలుకుతున్నాయి. ఇదిలా ఉండగా, 2023 మొదటి ఆరు నెలల్లో పాకిస్థాన్‌లో సగటు ద్రవ్యోల్బణం 33 శాతానికి పెరిగే అవకాశం ఉందని మూడీస్ సీనియర్ ఆర్థిక వేత్త చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News