Friday, November 22, 2024

పెట్రో ధరలు ఇక తగ్గవా?

- Advertisement -
- Advertisement -

Petrol and diesel prices are hike day by day

 

దేశంలో ప్రస్తుతమున్న ధరలు, ద్రవ్యోల్బణం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది, అసలు వాటి గురించి ప్రస్తావించుకోకుండా మౌనంగా భరిస్తూ పోవడం కంటే ఉత్తమం లేదనిపిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు అదే పనిగా శిఖరారోహణ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ పోతుంటే కిమ్మనకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న కేంద్ర పాలకులే ధరల అసాధారణ విజృంభణకు ద్రవ్యోల్బణం గత ఎన్నో ఏళ్ల పాటు ఎరుగని స్థాయికి పేట్రెగిపోవడానికి కారణమని స్పష్టపడుతున్నది. ఒకవైపు ఏడాదిగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కొవిడ్ 19 విలయం చిన్నా పెద్దా కార్యక్షేత్రాలన్నింటినీ మూతపెట్టి నిరంతరం కండలు కరిగించుకుంటేగాని పొట్టగడవని కొన్ని పదుల కోట్ల సాధారణ ప్రజలకు పనీపాటు లేకుండా చేసిన పెను ఆపదలో జనహిత దృష్టి కలిగిన పాలకులు ఏమి చేయాలి? ముందుగా సరకుల ధరలను అదుపులో ఉంచి వారికి వీలైనంత ఊరట కలిగించాలి. లేదా విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి అనువుగా ప్రజలకు నేరుగా నగదు చెల్లింపులు వంటి సహాయాలు చేయాలి. అదీ ఇదీ లేకుండా అద్దంలో పాయసం వంటి నోరూరించే ఉత్తుత్తి ఉద్దీపన పథకాలతో మాయ నాటకమాడి పుండు మీద కారం చల్లే పోకడను ప్రస్తుత మన కేంద్ర పాలకులు క్రూరంగా రక్తికట్టిస్తున్నారు.

ఇటువంటి నిర్దాక్షిణ్య పాలన ఇంతకుముందెప్పుడూ చూచి ఎరుగము అనడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటివరకు దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు 30శాతం పెరిగాయి. ఆ మేరకు రవాణా చార్జీలు విపరీత స్థాయికి చేరిపోయి సరకుల ధరలు ఎంతగా ఎగబాకి ఉంటాయో ఊహించవచ్చు. డీజెల్, పెట్రోల్ ధరల మధ్య ఒకప్పుడు బాగా తేడా ఉండేది. పెట్రోల్ కంటే డీజెల్ ధర తక్కువగా ఉన్నప్పుడు ఆ మేరకు రవాణా చార్జీలు పరిమితంగా ఉండి సరకుల ధరలు అదుపులో ఉండేవి. ఇప్పుడు ఈ రెండు ఇంధనాలు కవల పిల్లలను తలపిస్తూ సమానస్థాయిలో పెరిగి పేట్రెగిపోతున్నాయి. ఇది సరకుల ధరలను అసాధారణంగా మండిస్తున్నది. కూరగాయల వద్ద నుంచి పప్పులు, ఉప్పులు, వంట నూనెల వరకు అన్నీ ప్రియమైపోతున్నాయి. అటకెక్కి కూర్చుంటున్నాయి. అధిక ధరలు అనివార్యంగా ద్రవ్యోల్బణంలో ప్రతిబింబిస్తాయి. గత నెల (జూన్)లో చిల్లర ద్రవ్యోల్బణం 6.58కి పెరిగింది. మే నెలలో ఇది 6.30శాతం ఉంది. వచ్చే కొద్దిమాసాల పాటు ద్రవ్యోల్బణం 6శాతం పైనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టోకు ధరల సూచీ 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉధృతంగా పెరిగి గత మే నెలలో 12.94శాతానికి చేరుకున్నది. దీనికంతటికీ కారణం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడమేనని నిపుణులు పదేపదే చెబుతున్నారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.71, ఇప్పుడు రూ.10-౦ దాటిపోయింది. ఇంత భారీ విజృంభణకు కారణం ఒక్క గత ఏడాదిలో సంభవించిన అపూర్వస్థాయి పెరగుదలే. ఈ ధరలకు ప్రజల దగ్గరున్న పైస, పరక పొదుపు సొమ్ము కూడా ఆవిరైపోయి అప్పులు, తాకట్టు రుణాలు చేయవలసిన దుస్థితిలో వారు పడిపోయారు. ప్రజలకు కొనుగోలు శక్తి ఉన్నప్పుడే కొత్తకొత్త గృహోపకరణాల దగ్గర నుంచి బైకులు, కార్లు, విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి వారు సాహసిస్తారు. అది దేశ ఆర్థిక పురోగమనాన్ని పెంచి వృద్ధిని పైకి తీసుకువెళ్తుంది. ప్రజలను నిరంతరం పచ్చడి మెతుకుల వద్దనే కుప్పకూలిపోయి ఉండేలా పాలకులు చేసినప్పుడు వృద్ధి రేటు చతికిలపడి ఉంటుంది.

ఈ సూకా్ష్మన్ని గ్రహించైనా కేంద్రంలోని ఆర్థిక వ్యూహకర్తలు పెట్రోల్, డీజెల్ ధరలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించాలి. పెట్రోల్, డీజెల్‌లను వస్తు సేవల పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా వాటి ధరలు స్థిరంగా ఉండేలా చూడాలన్న ప్రతిపాదన కొంతకాలం చర్చల్లో నలిగింది. వాటిపై పన్నులు కేంద్రం తగ్గించుకోవాలని రాష్ట్రాలు, రాష్ట్రాలే తగ్గించుకోవాలని కేంద్రం మరికొంతకాలం పాటు వాదులాడుకున్నాయి. ఇప్పుడా ప్రసక్తే సద్దుమణిగిపోయింది. దేశంలో వినియోగించే పెట్రోల్‌లో అత్యధిక శాతం దిగుమతి చేసుకుంటున్నదే. ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగం దానిని కొనడానికే వినియోగిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బాగా తగ్గుముఖం పడినప్పుడు కూడా ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించి ఉండవలసిన ఎన్‌డిఎ పాలకులు అప్పుడు కూడా ఆ పని చేయకుండా వారి మూలుగులను పీల్చివేశారు. అందుచేత ఈ పాలనలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టవనే దృఢాభిప్రాయానికి ప్రజలు చేరుకున్నారు. ఇది పాలకులకు మంచి చేసే అంశం కాదు. పెట్రోల్ ధరల మీద ఎడాపెడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తూ పోవడమనేది మారితేగానీ అధిక ధరల నుంచి ప్రజలకు మోక్షం కలగదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News