దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు ఆగడం లేదు. రెండు రోజుల స్వల్ప వ్యవధి తర్వాత పెట్రోల్, డీజెల్ ధరలు శుక్రవారం నాడు మరోసారి ఎగబాకాయి. పెట్రోల్ మీద లీటర్ 19 పైసలు, డీజెల్‌పై 29 పైసలు పెంచారు. ఈ నెలలో ఈ ధరలు పెరగడం ఇది పదకొండవ సారి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ. 93.04కి. డీజెల్ రూ. 83.80కి చేరుకున్నాయి. ఇప్పటికే పెట్రోల్ లీటరు రూ. వందకి ఎగబాకిన రాజస్థాన్‌లో ఇప్పుడది రూ. 104కి పెరిగింది. డీజెల్ రూ. 96.62 అయింది. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా డిమాండ్ బాగా తగ్గిపోయినా ధరలు అదే పనిగా పెరుగుతుండడం గమనించవలసిన విషయం. మిన్ను విరిగి మీద పడుతున్నా, ప్రజల జేబులు మండిపోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా, చీమ కుట్టినంతైనా బాధ పడకుండా చిద్విలాసంగా వీటి ధరలు పెంచుతూపోడమే మన ప్రస్తుత కేంద్ర పాలకుల ఘనత అని పదేపదే చెప్పుకోనవసరం లేదు.
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలను తాత్కాలికంగా సంతోషంలో ఉంచి వారి ఓటును ఆకట్టుకోడం కోసం గత ఫిబ్రవరి 27 నుంచి 66 రోజుల పాటు ఈ జంట ఇంధనాల ధరల పెంపుకి పగ్గాలు బిగించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న ఫలితాలు వెలువడగానే 4వ తేదీ నుంచి వాటిని మళ్లీ వదిలివేసింది. దీనితో చమురు కంపెనీలు అదే పనిగా ధరల బాదుడికి ఉపక్రమించాయి. ధరలు పెంచని కాలంలో ఎదురైన ఆదాయ నష్టాన్ని ఇప్పుడవి పూడ్చుకుంటున్నాయి. ఎడమ చేత్తో ఇచ్చిన దాన్ని కుడి చేత్తో లాగేసుకుంటున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు, డాలర్‌తో రూపాయి మారకపు విలువ తగ్గినప్పుడు ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలను చమురు కంపెనీలు పెంచి వేస్తున్నాయి. పనిలో పనిగా తమ గత నష్టాలను కూడా పూడ్చుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారల్ 3040 డాలర్లకు పడిపోయి చాలా కాలం పాటు అదే స్థాయిలో కొనసాగినప్పుడూ ఆ మేరకు దేశీయ ధరలను తగ్గించివలసి ఉండగా మన పాలకులు ఆ పని కూడా చేయలేదు.
దేశంలో వినియోగిస్తున్న పెట్రోల్, డీజెల్‌లో 80 శాతం మేరకు దిగుమతి చేసుకుంటున్నదే. ఇందువల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ఉత్పత్తి, రేట్ల మీద దేశీయ ధరలు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశీయ క్రూడ్ ఉత్పత్తిని పెంచే దిశగా గణనీయమైన కృషి జరగకపోడం, జరిగినా అది ప్రైవేటు కార్పొరేట్ శక్తుల లాభాలకు ఊడిగం చేస్తూ ఉండడం ఈ దుస్థితికి కారణమని భావించవలసి వస్తున్నది. గత పాలకులు దేశీయోత్పత్తిని పెంచకపోడం వల్లనే పెట్రోల్, డీజెల్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడవలసి వస్తున్నదని ప్రధాని మోడీ ఆ మధ్య వితండ వ్యాఖ్యానం చేశారు. ఆయన పరిపాలనలోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో ఎందుకు ఆ పని చేయలేకపోయారో తెలియదు. గతంలో చాలా కాలం పాటు చమురు కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీలిచ్చి పెట్రోల్, డీజెల్ దేశీయ ధరలను అదుపులో ఉంచేది. మన జనాభాలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతికి చెందిన వారే కావడం వల్ల అలా ఇవ్వడం తప్పనిసరి అని భావించి అప్పటి పాలకులు ఆ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలు భరించలేని స్థాయిలో ధరలు పేట్రేగకుండా చూడడం సంక్షేమ విధానం ప్రధాన లక్షంగా ఉండేది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలు విరుచుకుపడిన తర్వాత ఆ మంచి రోజులకు మన పాలకులు మంగళం పాడేశారు. నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేశారు. అంతర్జాతీయ క్రూడ్ ధరల హెచ్చు తగ్గుల మేరకే దేశీయ ధరలలో ఈ మార్పులను అమలు చేసినా పెట్రోల్, డీజెల్ ఇంతగా ప్రియమైపోయి ఉండేది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ అవసరాలకు పెట్రోల్, డీజెల్ మీద పన్నులను బిగించడం వల్లనే వాటి ధరలు దుర్భరంగా పరిణమించాయి. పెట్రోల్ చిల్లర ధరలో 60 శాతం, డీజెల్ ధరలో 54 శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులే ఉంటాయి. ప్రతి లీటరు పెట్రోల్ ధరలో రూ. 32.90, డీజెల్ ధరలో రూ. 31.80 కేంద్ర ఎక్సైజ్ సుంకమే. రాష్ట్రాలు కూడా తమ తమ అవసరాలను బట్టి పన్నులు విధించుకుంటున్నాయి. యుపిఎ ప్రభుత్వం దిగిపోయి ప్రధాని మోడీ సారథ్యంలో ఎన్‌డిఎ పాలన మొదలైన 2014లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 9.48గా ఉన్న కేంద్ర ఎక్సైజ్ పన్ను ప్రస్తుతం రూ. 32.90 కి పెరిగింది. అలాగే డీజెల్‌పై అప్పుడు రూ.3.56గా ఉన్న కేంద్ర పన్ను ఇప్పుడు రూ. 31.80కి చేరుకున్నది. ప్రజలు అనేక విధాలుగా బాధలు పడుతున్న ప్రస్తుత దురవస్థలోనైనా కేంద్రం తన పన్నును గణనీయంగా తగ్గించుకొని ఆమేరకు కలిగే ఆదాయ లోపాన్ని అమితంగా ఐశ్వర్యాన్ని పోగులు వేసుకుంటున్న కార్పొరేట్ వర్గం నుంచి భర్తీ చేసుకోవచ్చు గదా?