Sunday, December 22, 2024

పెట్రో ధరలు తగ్గవా?

- Advertisement -
- Advertisement -

పేదల రక్తం పీలుస్తున్న పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడరాని పాట్లు పడుతున్నారు. అంటే 38 కోట్ల మంది నిరుపేదరికంలో మగ్గుతున్నారు. రవాణా ఛార్జీలను పెంచి వేస్తున్న అధిక ఇంధన ధరలు వీరి జీవితాలతో ఆడుకొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలను బట్టి దేశంలో డీజెల్, పెట్రోల్ ధరలను ఎప్పటికప్పుడు సవరించాలనే విధానాన్ని చేపట్టిన కేంద్రం 2022 మే నెల నుంచి వీటి ధరల్లో ఎటువంటి మార్పు తీసుకు రాలేదు. అప్పుడు మాత్రం పెట్రోల్‌పై లీటరు వద్ద రూ. 8, డీజెల్‌పై రూ. 6 తగ్గించారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. శుక్రవారం నాడు ఢిల్లీలో డీజెల్ ధర లీటరు రూ. 96.72 కాగా, చెన్నైలో రూ. 102.6, కోల్‌కతాలో రూ.106, ముంబైలో రూ. 111.3. అలాగే పెట్రోల్ ధరలు ఢిల్లీలో రూ. 96.72 కాగా, కోల్‌కతాలో రూ. 106.03, ముంబైలో రూ. 106.31, చెన్నైలో రూ.102, మొత్తమ్మీద రెండు ఇంధనాల ధరలు లీటరు వద్ద వంద రూపాయలకు అటు ఇటుగా కొండెక్కి కూచున్నాయి.

ఇప్పటికి 11 మాసాలుగా మండు వేసవి మాదిరిగా ప్రజల నెత్తిన నాట్యం చేస్తున్న ఈ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలైతే లేవు. ఎందుకు ఇలా జరుగుతున్నది? గత్యంతరం లేని పరిస్థితే ఇందుకు కారణమా? తగ్గించే అవకాశాలున్నప్పటికీ ఆ పని చేసి 140 కోట్ల మంది ప్రజలకు ఊరట కలిగించాలనే సదుద్దేశం ప్రధాని మోడీకి లేనందువల్లనా? తరచి చూస్తే రెండోదే నిజమని తేలుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 77 డాలర్లుగా వుంది. ఇది వాస్తవానికి అధిక ధర కాదు. గతంలో 100 డాలర్లు దాటిపోయిన సందర్భాలున్నాయి. పైపెచ్చు ప్రపంచంలోని అనేక దేశాలకు లేని ఒక గొప్ప సౌకర్యాన్ని భారత దేశం అనుభవిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి నుంచి రష్యా నుంచి చవకగా క్రూడాయిల్‌ను కొనుగోలు చేసే అవకాశం మనకు కలిగింది. రష్యాకు గుణపాఠం చెప్పి తమ దారికి రప్పించుకోడానికి అమెరికా, యూరపు దేశాలు అక్కడి నుంచి కొనుగోలు చేసే క్రూడాయిల్ ధరను బ్యారెల్ 60 డాలర్ల వద్ద స్తంభింప చేశాయి. అలాగే రష్యన్ ఆయిల్‌ను ఇతర దేశాలకు తీసుకుపోయే నౌకలు అందుబాటులో లేకుండా చేశాయి. నౌకలకు బీమా సౌకర్యం లభించకుండా అడ్డుకొన్నాయి.

రష్యా ఆదాయంలో సగం ఆయిల్ మీదనే వస్తుంది. ఆయిల్ ఎగుమతులు చేయకపోతే దానికి ప్రాణం ఆడదు. అందుచేత చవకగానైనా చైనా, ఇండియా వంటి దేశాలకు రష్యా తన ఆయిల్‌ను విక్రయిస్తున్నది. యుద్ధానికి ముందు రష్యా నుంచి అతి తక్కువ కిమ్మత్తు ఆయిల్‌ను కొనుగోలు చేసిన ఇండియా ఆ తర్వాత భారీ మొత్తంలో దిగుమతి చేసుకోడం ప్రారంభించింది. అంతకు ముందరి కంటే పది, పదిహేను రెట్లు ఎక్కువగా రష్యన్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకొంటున్నట్టు సమాచారం. 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు గల ఏడు మాసాల్లోనే రష్యన్ ఆయిల్ కోసం ఇండియా 20 బిలియన్ డాలర్లు చెల్లించింది. ఇలా అతి తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్‌ను దేశంలో ప్రజలకు చవకగా కేంద్రం ఎందుకు సరఫరా చేయడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికితే రష్యా నుంచి వస్తున్న చవక ఆయిల్‌లో ముప్పావు వంతు రిలయెన్స్, రష్యా ఆశీస్సులున్న నయారా ఎనర్జీ సంస్థలే కొనుగోలు చేస్తున్నాయని వెల్లడైంది.

ఈ కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు కొంటున్న క్రూడాయిల్‌ను శుద్ధి చేసి యూరపు దేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నాయి. రిలయెన్స్ తాను కొనుగోలు చేస్తున్న మొత్తం ఆయిల్‌లో మూడింట ఒక వంతు రష్యా నుంచి పొందుతున్నది. రష్యా నుంచి నేరుగా ఆయిల్ కొనుగోలును బంద్ చేసిన యూరపు దేశాలు దొడ్డి దారిలో ఇలా దానిని కొనుగోలు చేస్తుండడం గమనించవలసిన విషయం. దేశంలో ప్రజలకు 90% పెట్రోల్, డీజెల్ సరఫరా చేసే పబ్లిక్ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలు అతి తక్కువ కిమ్మత్తు రష్యన్ ఆయిల్ మాత్రమే దిగుమతి చేసుకోగలుగుతున్నాయి.

ఇదేమి చిత్రమని అడిగితే రష్యన్ ఆయిల్‌తో లాభపడుతున్న ప్రైవేటు కంపెనీల నుంచి అదనపు పన్నును వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నది. పన్ను ఆదాయం కక్కుర్తితో ప్రజలను అధిక ఇంధన ధరల మంటల్లో మలమలమాడ్చడం ఏ రకమైన ప్రజా సేవ అని కేంద్రాన్ని నిలదీయవలసి వుంది. దీనిని బట్టి చూసినప్పుడు పబ్లిక్ రంగ చమురు సంస్థల పాత బకాయిలు తీర్చడం కోసం ప్రజల నుంచి అధిక ధరలను వసూలు చేయక తప్పడం లేదని గతంలో చెప్పిన కారణం బూటకమేనని స్పష్టపడుతున్నది. రాకరాక వచ్చిన రష్యన్ చవక ఆయిల్ అవకాశాన్ని దేశ ప్రజలకు మేలు చేయడం కోసం కాకుండా కార్పొరేట్లకు సేవ చేయడం కోసం దుర్వినియోగం చేయడం కంటే జనద్రోహం వేరే ఏముంటుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News