రాంచీ : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌శర్మ అనుచిత వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో హింసాత్మక నిరసనలు జరిగిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆలయంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. సూర్య మందిర్ ఆలయం లోపలికి నాలుగు పెట్రోల్ బాంబులు విసిరిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పూజారి తన కుటుంబ సభ్యులతో పాటు నిద్రిస్తున్నారు. బాంబుల దాడికి వారు భయాందోళనలు చెందారు. దోషులను పట్టుకోడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు నూపుర్ శర్మ వ్యాఖ్యలపై రాంచీ నగరంలో నిరసన ప్రదర్శనలు సాగాయి. నూపుర్ శర్మపై కఠిన చర్యలు చేపట్టాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో నిరసన కారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఘర్షణలో గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. క్షత గాత్రుల్లో ఇద్దరు మరణించారని ఆస్పత్రివర్గాలు శనివారం వెల్లడించాయి. రాంచీలో పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
విద్వేష వ్యాఖ్యలపై రగడ.. ఆలయంపై పెట్రోల్ బాంబుల దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -