చెన్నై : తమిళనాడు రాజ్‌భవన్ మెయిన్‌గేట్‌పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులు విసిరిన సంఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి స్పందించారు. ఈ దాడి సంఘటనను పోలీస్‌లు సీరియస్‌గా తీసుకోవడం లేదని తమిళనాడు రాజ్‌భవన్ విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై రాజ్‌భవన్ ఫిర్యాదును పోలీస్‌లు స్వీకరించడం లేదని, కేవలం విధ్వంస ఘటనగా దీన్నిపరిగణిస్తూ కొట్టి పారేస్తున్నారని ఆరోపించింది.
సుమోటోగా కేసు నమోదు చేసి హడావిడిగా నిందితుడిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తరలించారని పేర్కొంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే దాడి వెనుక ఎవరున్నారో తెలిసే అవకాశం ఉందని , దర్యాప్తును అడ్డుకుంటే వాస్తవాలు వెలుగు లోకి రావని రాజ్‌భవన్ తెలిపింది. దర్యాప్తు ప్రారంభం కాకుండానే నిష్పాక్షిక దర్యాప్తు ముందుకు కదలకుండా చంపేశారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఎన్‌ఐఎచే సమగ్ర దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది.