ఇది రౌడీ షీటర్ పనే: పోలీసులు
చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు అనుకూలంగా బిజెపి తీసుకున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఒక 38 ఏళ్ల రౌడీ షీటర్ గురువారం చెన్నై టి నగర్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున టూవీలర్‌పై వచ్చిన ఆ వ్యక్తి పెట్రోలు నింపిన మూడు సీసాలకు నిప్పు పెట్టి వాటిని బిజెపి ప్రధాన కార్యాలయంపైకి విసిరినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 38 ఏళ్ల వినోద్ అలియాస్ కరుక్కా వినోద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రౌడీ షీట్ ఉందని, గతంలో అతనిపై హత్యా నేరంతోసహా అనేక నేరాలకు సంబంధించి కేసులు ఉన్నాయని నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా..తమ పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడిని బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నాదురై ఖండించారు. ఈ దాడికి నీట్ పరీక్షను సాకుగా చూపడాన్ని సినిమా డైలాగుగా ఆయన అభివర్ణించార. ఈ దాడి ఘటనను ఎన్‌ఐఎతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలపై, నాయకులపై వరుసగా దాడులు జరగడాన్ని ఆయన ఖండించారు.