Friday, November 22, 2024

పెట్రో మంటలు ఆరేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

petrol diesel prices touch record in india

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష పన్నుల దోపిడీ మొదలైంది. గత ఐదారేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తెలియకుండానే పెరిగి ప్రస్తుతం దేశమంతా లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. కొద్ది చోట్ల లీటర్ డీజిల్ కూడా వంద రూపాయలు మార్కు దాటింది. 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మరో మూడేళ్లలో లీటర్ పెట్రోల్ డీజిల్ 150 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ పెట్రో ధరల మంట ఆరడానికి ప్రభుత్వాలు ఏమాత్రం కృషి చేయకుండా వరుసగా పెంచుతూ పోతున్నాయి. ఈ విషయంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ఎంతో ఉంది.

ప్రత్యక్ష పన్నులు కట్ -పరోక్ష పన్నులు నీట్

ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేసి దానికి సరైన న్యాయం చేసే వ్యవస్థ పోయి రెండు దశాబ్దాలు దాటాయి. ప్రజలకు తాము చెల్లించే పన్నులకు తగ్గ సేవలు అందకపోతే ప్రశ్నించే మనస్తత్వం ఉండేది. ఎప్పుడైతే ఓటుబ్యాంకు రాజకీయాల వలలో పడి లో ఓటు అమ్ముకుంటున్నారో ప్రభుత్వాలను పార్టీలను ప్రశ్నించే నైతిక హక్కు కూడా ప్రజలు కోల్పోతున్నారు.దాంతో ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పరోక్ష పన్నుల రూపం లో ప్రజలను పిండి పిప్పి చేస్తున్నాయి.పోనీ అలా వసూలు చేసిన పన్నుల ద్వారా ప్రజల మౌలిక వసతులు పెంచడానికి విద్య ఆరోగ్య రంగాల మీద సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అదీ లేదు.ఎన్నికలలో వరాలు ఇవ్వడానికి అనుచిత ఉచితాలు తాయిలాలు ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టుకోవడానికి మాత్రమే ప్రజలు కట్టిన పన్నులను వినియోగిస్తున్నారు. ఇలా ప్రజల పన్నులు యధేచ్ఛగా పందేరం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పరిశీలిస్తే అందులో ప్రజల మౌలిక జీవన పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి కనబడడం లేదు.

చాణిక్యనీతి పాటిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రత్యక్ష పన్నులను మెల్లమెల్లగా రద్దు చేస్తూ వారికి తెలియకుండా మద్యం ధరలతో పాటు పెట్రో ధరలు పెంచుకుంటూ పరోక్ష పన్నుల వాటా పెంచుకుంటున్నారు. పైకి చూడబోతే తమ మీద పన్నుల భారం తగ్గిస్తున్నట్టు ప్రజలు అనుకునేలా ప్రతి ఎన్నికలలో అనేక ఉచిత హామీలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని చాలా రాష్ట్రాలలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రజలకు కోరని వరాలు ఇచ్చాయి.

మున్సిపల్ ఆస్తి పన్నులో రాయితీ తో పాటు మంచినీటి సరఫరాకి చెల్లించే చార్జీలు కూడా కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. ఇక ఆల్ ఫ్రీ ఎజెండా వచ్చాక మెల్లమెల్లగా ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గింది.పరోక్ష పన్నుల వాటా దానికి పది రెట్లు పెరిగింది. అందుకే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ప్రజలకు తెలియకుండా ప్రజల నుండి పన్నులు వసూలు చేసే పద్ధతి అలనాటి ఆర్థిక శాస్త్రం రాసిన చాణిక్యుడి కంటే ఇప్పటి రాజకీయ నాయకులు పది ఆకులు ఎక్కువే చదివారనిపిస్తుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడని సుమతి శతకకారుడు చెప్పినట్లు నేటి పాలకులు ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా రద్దు చేస్తూ పరోక్ష పనులను ఎడాపెడా బాదుతున్నారు.

ఓటు వేసేది మనం- పన్నులు కట్టేది మనం

ప్రజలు తినే తిండి మీద మొదలుకొని, కట్టే బట్ట మీద తెల్లారి లేస్తే రాత్రి పడుకునే దాకా వాడుకునే అన్ని వస్తువుల మీద జిఎస్టి పేరుమీద పన్నులు వసూలు చేస్తున్నారు. పుట్టిన పసిగుడ్డు కు బొడ్డు కోసే రేజర్ బ్లేడ్ నుంచి మొదలుకొని చివరికి శవం మీద కప్పే తెల్ల బట్ట వరకు అన్నిటి మీద పరోక్ష పన్నులు వేస్తున్నారు. ప్రాణాలు పోసే ఔషధాలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. విద్య, ఆరోగ్య రంగాలలో కూడా పరోక్ష పన్నుల దోపిడి ఎక్కువగానే ఉంది. కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటా లో పెద్ద తేడా ఏమీ రాకపోవడానికి కారణం ప్రధానంగా పెట్రో ధరల పెంపు అని చెప్పవచ్చు. వివిధ రంగాలలో ఆర్థిక లోటు కనిపించి నా కూడా వరుసగా గత రెండేళ్లుగా పెట్రోల్ ధరలు ఇంతింతై వటుడింతై అన్నట్లు 30 రూపాయలకు పైగా పెరిగి వంద రూపాయలు దాటింది. పెట్రోలు, మద్యం, రిజిస్ట్రేషన్ల పై వచ్చే ఆదాయమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఆసరాగా ఉంటుంది. కానీ ప్రజల మీద ఈ మూడు రంగాల్లో పడే పన్నుల డబ్బు మిగితా రంగాల కంటే మించి పోయింది.జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన మద్యం పెట్రో ధరల పైనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకుంటున్నాయి.

రెట్టింపు ధరలు పెరిగిన పెట్రో ఉత్పత్తులు

పెట్రో ధరల విషయానికి వస్తే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి ధరలను పోలిస్తే దానికి పదింతల పన్నులను విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దోచుకుంటున్నాయి. ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు గతంలో $120 డాలర్లకు పైగా ఉన్నప్పుడు 60 నుండి 70 రూపాయల లోపే లీటర్ డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయి. ప్రస్తుతం $70 డాలర్లు కూడా దాటని క్రూడాయిల్ ధరల కు పెట్రోల్ డీజిల్ ధరలు 100 దాటడం దోపిడీకి నిదర్శనమే. 2013 వరకు పెట్రో ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల శాతం కేవలం 44 శాతం మాత్రమే.అదే ప్రస్తుతం ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా 110% పనులను విధిస్తున్నారు. 2017 సంవత్సరము నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల విధానం అమలు మొదలుపెట్టాక మిగతా అన్ని పరోక్ష పన్నుల లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటున్నాయి.

కానీ పెట్రో ఉత్పత్తులపై తమ తమ ఇష్టానుసారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మరింత దోపిడీ చేస్తున్నాయి.పెట్రో ఉత్పత్తుల ధరల టెంపుల్ పు అక్కడికే పరిమితం కాదు. సమాజంలోని అన్ని రకాల సేవలు, వస్తువులపై పెట్రో ఉత్పత్తుల ధరల ప్రభావం పడుతుంది. ఒకవైపు ప్రజలకు ఫ్రీగా తాయిలాలు ఇస్తూ మరోవైపు పెట్రో వడ్డన వల్ల పేద ప్రజలను కూడా కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. అనుచిత ఉచితాల ద్వారా గోరంత ఇచ్చి పెట్రో ధరల పెంపుతో కొండంత తవ్వుకుంటున్నారు. ఒకప్పుడు ఆర్టీసీ చార్జీలు కిలోమీటర్ కి ఒక్కపైసా పెంచితే రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ప్రజలు ప్రస్తుతం రవాణా చార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు, మద్యం ధరలు పెరుగుతున్నాకూడా ప్రశ్నించని నిస్సహాయస్థితిలో పడుతున్నారు.

‘తాగే వాడే తాళ్ల పన్ను కడతాడు‘ అన్న సామెత ఉండనే ఉంది. అలాగే ప్రభుత్వాలు నడవాలంటే పన్నుల రూపంలో ఇంధనం సమకూర్చేది సామాన్య ప్రజలే. కానీ అలాంటి సామాన్య ప్రజలను ఏమార్చడానికి ప్రత్యక్ష పన్నులు రద్దు చేస్తున్నట్టు నటిస్తూనే పరోక్ష పన్నుల ద్వారా ప్రజల మీద విచ్చలవిడిగా పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెప్పాలంటే ప్రజలు సరైన విధంగా ఆలోచించాలి. ఓటు వేసేది, పన్నులు కట్టేది మనం చెల్లించే పన్నులకు సరైన సేవలు అందాలనే నినాదంతో ప్రజలు ముందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వాల ఆటలు సాగవు. లేకపోతే చచ్చిన దానికి వచ్చినంత కట్నం అంటూ మనం ఓటు అమ్ముకుంటూనే ఉంటాం వాళ్లు దోచుకుంటూనే ఉంటారు.

-బండారు రామ్మోహనరావు- 98660 74027

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News