Friday, December 20, 2024

పెట్రోల్ ధర భారత్‌లోనే ప్రియం!

- Advertisement -
- Advertisement -

Petrol Bunk
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు ఉన్నాయి. మీరు పన్నులు తగ్గించుకోండి అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ కాలం గడిపేస్తున్నారే తప్ప ప్రజల ఘోష అర్థం చేసుకోవడం లేదు.పెట్రోల్ ధర భారత్‌లో కన్నా చైనా, బ్రెజిల్, జపాన్, అమెరికా, రష్యా, పాకిస్థాన్, శ్రీలంకలో చౌక అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్స్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. మే 9న వివిధ దేశాలలో తలసరి ఆదాయంతో సహా పెట్రోల్ ధరల గురించి తన రిపోర్టులో పేర్కొంది.

50 దేశాలలో పెట్రోల్ ధరలు గరిష్టంగా ఉన్నాయి. అందులో భారత్ 42వ ర్యాంకులో ఉంది. ఇండియాలో లిటరు పెట్రోల్ ధర 1.35 డాలరుగా ఉంది. కాగా మధ్యస్థ ధర(మీడియన్ ప్రైస్) 1.22 డాలరుగా ఉంది. భారత్ పెట్రోల్ ధరలు ఆస్ట్రేలియా, టర్కీ, దక్షిణకొరియాకు సమానంగా ఉన్నాయి. కాగా హాకాంగ్, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, గ్రీస్, ఫ్రాన్స్, పొర్చుగల్, నార్వేలో పెట్రోల్ ధర భారత్ కన్నా ఎక్కువ. అక్కడ లీటర్ పెట్రోల్ 2 డాలర్లు ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువ ఉన్న దేశాల్లో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉంటే అక్కడ ద్రవ్యోల్భణం (ఇన్‌ఫ్లేషన్) ప్రభావం కూడా ఎక్కువే ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం ప్రభావం తక్కువ ఆదాయ వర్గాల వారిపై తలకు మించిన భారంగా మారుతుందని బిఓబి రిపోర్టు పేర్కొంది.

భారత్ కన్నా తక్కువ తలసరి ఆదాయ ఉన్న దేశాలు అంటే కెన్యా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, వెనెజులా వంటి దేశాల్లో పెట్రోల్ ధర భారత్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయన్నది ఇక్కడ గమనార్హం. పెట్రోల్ వంటి ఇంధన ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు తమ పన్నులు తగ్గించుకుంటే మంచిదని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో ఇంధనం అత్యధికంగా వినియోగించే దేశాల్లో మూడో స్థానంలో ఇండియా ఉంది. పైగా ఇండియా 85 శాతం మేరకు ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకోనని ఖరాకండిగా చెబుతోంది. పైగా రాష్ట్రప్రభుత్వాలే వ్యాట్ లేక అమ్మకపు పన్నును తగ్గించుకోవాలని తద్వారా సామాన్యుడికి వెసలుబాటు కల్పించాలని వాదిస్తోంది. హాంకాంగ్‌లో పెట్రోల్ అత్యధికం. అక్కడ లీటరు పెట్రోల్ ధర 2.58 డాలర్లు, కాగా మలేసియాలో పెట్రోల్ ధర కారుచౌక. అక్కడ లీటరు పెట్రోల్ ధర 47 సెంట్లు. భారత కన్నా దాని ఇరుగు పొరుగు చిన్న దేశాలే తక్కువ ధరకు పెట్రోల్‌ను అందిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర 1.05 డాలర్లు కాగా, పాకిస్థాన్‌లో 77 సెంట్లు, శ్రీలంకలో 67 సెంట్లు మాత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News