Thursday, January 23, 2025

‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!

- Advertisement -
- Advertisement -

Petrol rate India more than Srilanka

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్‌పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీకి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి. ఆవ్‌ుఆద్మీ ఢిల్లీ సర్కార్ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్థితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు.

ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో వీర బాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను,కొన్ని రాష్ట్రాలు వాట్ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్తంభింపచేశాయి. ఇవన్నీ దేశం లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజెల్ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెలనెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్ర మోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్ 27వ తేదీ ఎకనమిక్ టైవ్‌‌సు పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రూ. 118. 14, పాట్నాలో రూ. 116.23, బెంగళూరులో రూ. 111.09, లక్నోలో రూ. 105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా? గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్‌కావ్‌ు సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్ 25న పెట్రోలు రేటు రూ. 373, అదే మన కరెన్సీలోకి మార్చితే రూ. 80.39, సీతాదేవి పుట్టిన నేపాల్లో రూ.100 ఉంది. మన రామరాజ్యంలో రూ. 105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్‌లో రూ. 61.41, బంగ్లాదేశ్‌లో రూ. 79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడే వారికి ఆగ్రహం రావటం సహజం.

పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి? ప్రభుత్వాలు బాండ్ల ను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.

200203 సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నాడు వాజ్‌పేయ్ సర్కార్ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 201415 సంవత్సర బడ్జెట్ పత్రాలలో పేర్కొన్న దాని ప్రకారం 201314 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రూ. 1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ “కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేసిన రూ. 1.44 లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం రూ. 70 వేల కోట్లు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్ధం. తొలుత కాంగ్రెస్ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దు లో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనంగాక ఎవరు భరించాలి? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ధి పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో రూ. లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా, ఇజ్రాయెల్, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు? ఇప్పటి వరకు చెల్లించిందిపోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో రూ. 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి, డిసెంబరు మాసాల మధ్య రూ. 37,306.33 కోట్లు, 2025లో రూ. 20,553. 84 కోట్లు, చివరిగా 2026లో రూ. 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 201415 నుంచి 202122 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్, ఆదాయపన్ను మొత్తం రూ. 4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రూ. 21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రూ. 25,89,388 కోట్లు? కాంగ్రెస్ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?

ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది. 201415లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రూ. 1,26,025 కోట్లు కాగా, 202021కి అది రూ. 4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021 22లో అది రూ. 3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారా న్ని తెలివిగా తెర వెనక్కు నెట్టాలని చూస్తున్నది.

ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికీ చమురు మీద వచ్చిన వాట్ మొత్తం రూ. 13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్న దానిలో సగం. 2014 15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రూ. 1,60,526 కోట్లు కాగా, కేంద్రానికి వచ్చింది రూ.1,26,025 కోట్లు మాత్రమే. 202021కి రాష్ట్రాలకు రూ. 2,17,221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రూ.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ (పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32 శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరంలేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు రూ. 5000 కోట్లు, గుజరాత్‌లకు రూ. 3,500 4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు. బిజెపియేతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రా ల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.

ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్‌టిసికీ చిల్లర ధరలకే డీజెల్ సరఫరా చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి.ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి.

ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్‌టిసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్‌టిసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులుబాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్‌టిసి లేదా మరొక రాష్ర్ట సంస్ధకైనా, రీటైల్ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి.ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరుకాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు రూ. 85 లక్షల అదనంగా చెల్లించాల్సి వస్తోందని, ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది.మిగతా రాష్ట్రాల ఆర్‌టిసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజెల్ పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News