రెండవ వారంలో పిజి తరగతులు ప్రారంభం..?
ఈసారి పిజి కోర్సుల్లో కామన్ క్యాలెండర్ అమలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు సాంప్రదాయ యూనివర్సిటీల పరిధిలో రెండు లేదా మూడవ వారంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వివిధ వర్సిటీలలో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సిపిగెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం రెండో విడత సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 5వరకు రిపోర్టింగ్‌కు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండవ వారంలో తరగతులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పిజి కోర్సుల్లో కామర్ క్యాలెండర్ అమలు
రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో ఈ విద్యాసంవత్సరం నుంచి పిజి కోర్సుల్లో కామన్ క్యాలెండర్ అమలు కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదివరకే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ వర్సిటీలలో పిజి కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతున్న నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో పిజి కోర్సుల్లోనూ ఒకేసారి తరగతుల ప్రారంభం, పరీక్షల నిర్వహణకు కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ కోర్సుల్లో కామన్ క్యాలెండర్ విధానం ఇప్పటికే అమలవుతుండగా, ఈ ఏడాది నుంచి పిజి కోర్సుల్లో కూడా అమలు కానుంది. కామన్ క్యాలెండర్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఒకేసారి సెమిస్టర్లు ప్రారంభం కావడంతో పాటు ఒకేసారి పూర్తవుతుంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పిజి తరగతులు ప్రారంభమయ్యే లోగా కామన్ క్యాలెండర్ రూపొందించనున్నట్లు తెలిసింది.
PG Classes will begin from Jan 2nd week in TS Universities