Monday, December 23, 2024

డిగ్రీలో ఏ కోర్సు చేసినా పిజిలో పొలిటికల్ సైన్స్

- Advertisement -
- Advertisement -

పిజి ప్రవేశాల్లో సంస్కరణలు
నెలాఖరులో పిజి ఉమ్మడి పరీక్ష నోటిఫికేషన్
నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 10శాతానికి పెంపు
: ఉన్నతవిద్యామండలి చైర్మన్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. సిపిగెట్ ప్రవేశ పరీక్ష విధానంలో ఈసారి పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పిజి కోర్సుల్లో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్టేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ పిజి కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి డిగ్రీలో ఏ కోర్సు చేసినా అర్హులే అని పేర్కొన్నారు. ఈసారి ఆయా పిజి కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదివరకు ఈ పిజి కోర్సులు చేయాలంటే సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ చదివి ఉండాలనే నిబంధన ఉండేదని, ఈసారి దానిని మార్పు చేసినట్లు తెలిపారు. ఇదివరకు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎల్‌ఎస్‌ఐసీ, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ సోషల్ వర్క్, ఎం.ఎ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే అని, అదే తరహాలో మరిన్ని కోర్సులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సోమవారం సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్షలో తీసుకువచ్చిన సంస్కరణలు, న్యాక్ అక్రిడియేషన్,జీరో అడ్మిషన్స్ కళాశాలలపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్ రెడ్డి, రమేష్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్ లింబాద్రి సమావేశంలో చర్చించిన అంశాలను విలేకరులకు వివరించారు. పిజి కోర్సుల్లో ఇతర రాష్ట్రాలవారికి నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద 5 శాతం సీట్లు కేటాయిస్తుండగా, ఈసారి ఆ కోటాను 10 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఈ కోటా కింద ప్రవేశాలు పొందే ఇతర రాష్ట్రాల విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

న్యాక్‌పై దృష్టి సారించాలి

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) హోదా పొందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. వర్సిటీల పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలూ న్యాక్ గుర్తింపు పొందేందుకు ఉన్నత విద్యామండలి తగిన ప్రోత్సాహం అందించనుంది. న్యాక్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాలలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహం ఇస్తామని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 125 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా 90 కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు చెందిన కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఇవ్వడంపై ఈ నెలాఖరులో ఆయా కాలేజీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ సమావేశానికి న్యాక్ డైరెక్టర్ హాజరవుతారని చెప్పారు.

అలాగే డిగ్రీ కోర్సుల్లో విదేశీ భాషలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్రెంచ్ అలయెన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలోనే జర్మనీ, జపాన్, స్పానిష్ భాషలకు సంబంధించి ఎంఒయు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. విదేశీ భాషలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నోడల్ ఎజెన్సీగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు ఒక ఎలక్టివ్ పేపర్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, దీనిని దూరవిద్య లేదా రెగ్యులర్‌గా పూర్తి చేయవచ్చని అన్నారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఎబిసి)పై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

జీరో అడ్మిషన్లు నమోదైతే అనుమతులు రద్దు

డిగ్రీ కాలేజీల్లో వరుసగా మూడు సంవత్సరాల పాటు జీరో అడ్మిషన్లు నమోదు ఆయా కాలేజీల అనుమతులు రద్దు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఆ మేరకు సంబంధిత యూనివర్సిటీలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. ఏదైనా కోర్సులో మూడు సంవత్సరాల పాటు అడ్మిషన్లు నమోదు కాకపోతే ఆ కోర్సును మార్చుకునేందుకు కాలేజీలకు అనుమతిస్తామని చెప్పారు. పూర్తిగా కాలేజీలోనే జీరో అడ్మిషన్లు నమోదైతే మాత్రం కాలేజీ అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కాలేజీలను దోస్త్‌లో పొందుపరచమని చెప్పారు. రాష్ట్రంలో జీరో అడ్మిషన్లు నమోదవుతున్న డిగ్రీ కాలేజీలు సుమారు 50 వరకు ఉంటాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News