వెబ్‌డెస్క్: పిజి వైద్య విద్యార్థి డాక్టర్ సైఫ్ అలీ భవితవ్యాన్ని తేల్చడానికి ర్యాగింగ్ నిరోధక కమిటీ త్వరలోనే సమావేశం కానున్నదని వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల(కెఎంసి) ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ బుధవారం తెలిపారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ హైకోర్టుకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. డాక్టర్ సైఫ్‌పై వచ్చిన ఆరోపణలను మరోసారి దర్యాప్తు చేయాలంటూ కెఎంసికి చెందిన యాంటీ ర్యాగింగ్ కమిటీని, వైద్యాధికారులను తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
మొదటి సంవత్సరం పిజి వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో రెండవ సంవత్సరం పిజి విద్యార్థి డాక్టర్ సైఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. డాక్టర్ సైఫ్‌ను కెఎంసి నుంచి సస్పెండ్ చేస్తూ కళాశాల యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ కెఎంసి ప్రిన్సిపాల్ తనను తరగతులకు అనుమతించడం లేదంటూ డాక్టర్ సైఫ్ సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు.
డాక్టర్ సైఫ్ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయమే అంతిమమని తెలిపింది. డాక్టర్ సైఫ్‌ను తరగతులకు అనుమతించకపోవడం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే అవుతుందని కూడా హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు ఉత్తర్వులు తమకు అందాయని, మంగళవారం నుంచి డాక్టర్ సైఫ్‌ను తరగతులకు అనుమతిస్తున్నామని కెఎంసి ప్రిన్సిపాల్ తెలిపారు.