Monday, December 23, 2024

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మొదటి పాట విడుదల

- Advertisement -
ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాట ‘కనుల చాటు మేఘమా’ .వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేసింది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే మొదటి పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
 
అందమైన మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది అందెవేసిన చేయి. ఇక అది శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రమైతే ఆయన సంగీతం మరింత మాయ చేస్తుంది. అందుకే శ్రీనివాస్ అవసరాల చిత్రాలకు కళ్యాణి మాలిక్ స్వరపరిచే పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే మొదటి పాట లిరికల్ వీడియోను గురువారం ఉదయం విడుదల చేశారు. కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. మేఘాల్లో తేలిపోతున్నామనే భావన కలిగించే అంత హాయిగా, ఆహ్లదకరంగా ఈ పాట సాగుతోంది. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. “కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా” అంటూ ఆయన పాటను ఎంతో అందంగా ప్రారంభించారు. ఆయన కలం నుంచి జాలు వారిన అక్షరాలు ఎంతో అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. “నువ్వు లేని చోట దారి ఆగిందని.. కాలమాగిపోయి నిన్ను వెతికిందని” అంటూ ఇలా పాటలోని ప్రతి వాక్యం మనసుని హత్తుకునేలా ఉంది. ఈ అందమైన పాటను గాయకుడు ఆభాస్ జోషి అంతే అందంగా ఆలపించారు. ఆయన మధుర స్వరం పాటను మరోస్థాయికి తీసుకెళ్ళింది. కళ్యాణి మాలిక్ సంగీతం, లక్ష్మీ భూపాల సాహిత్యం, ఆభాస్ జోషి గాత్రం మూడూ అద్భుతంగా కుదిరి ‘కనుల చాటు మేఘమా’ను మధురమైన పాటగా మలిచాయి. లిరికల్ వీడియో చూస్తుంటే ఓ పెళ్లి వేడుకలో కథానాయికను చూస్తూ కథానాయకుడు ఆమెతో గడిపిన క్షణాలను, ఆమె మిగిల్చిన జ్ఞాపకాలను తలచుకుంటూ పాడుతున్నట్లుగా ఉంది. వీడియోలో ప్రతి ఫ్రేమ్ హరివిల్లును తలపిస్తోంది. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
 
 
ఈ పాట రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ..’ఒకప్పుడు నాకు నచ్చిన కాంబినేషన్ వంశీ, ఇళయరాజా.. ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి కాంబినేషన్  శ్రీనివాస్ అవసరాల, కల్యాణి మాలిక్.. వాళ్లిద్దరి కలయికతో వచ్చే సినిమాల్లో పాటలకి ప్రత్యేకత ఉంటుంది.. అందమైన మెలోడీ ఉంటుంది.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో వారి కాంబినేషన్ లో చాలా చక్కటి మెలోడీ ట్యూన్ కి పాట రాసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం.. ” కనులచాటు మేఘమా” అంటూ సాగే సాహిత్యం అద్భుతంగా కుదిరింది… అతిశయోక్తిలా అనిపించినా నా పాటకు నేనే ఫ్యాన్ అయిన సందర్భం ఇది… ఆభాస్ జోషి ప్రాణం పెట్టేశాడు తన తియ్యని గొంతులో… చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో ఇది ఖచ్చితంగా గుర్తిండిపోయే పాట అవుతుందని నమ్ముతున్నాను ..’ అన్నారు.
 
‘కనుల చాటు మేఘమా’ పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “జ్యో అచ్యుతానంద తర్వాత నేను ఈ కథ అనుకుంటున్నప్పుడు కళ్యాణ్ గారికి ఇంకా చెప్పలేదు. కథలో ఈ పాట తాలూకు సందర్భం వచ్చినప్పుడు ఇది ‘ఏం సందేహం లేదు’, ‘ఒక లాలన’ పాటల స్థాయిలో ఉండాలి అనిపించి వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి.. “మనం ఒక లవ్ స్టొరీ చేస్తున్నాం అండీ.. అందులో నాకు చాలా ఇష్టమైన సందర్భం ఒకటి వచ్చింది. దానికి ఒక మంచి పాట కావాలి.” అన్నాను. కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు. లక్ష్మీ భూపాల గారు ‘కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా’ అంటూ సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు. గతంలో నేను సోషల్ మీడియాలో ఆభాస్ జోషి పాటలు విని ఇలాంటి గొంతు మన సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఇంత మంచి పాటను ఎవరి చేత పాడించాలి అనుకున్నప్పుడు.. ఆభాస్ జోషి గుర్తొచ్చి కళ్యాణ్ గారికి చెప్పాను. ఆయనకు కూడా ఆభాస్ జోషి గాత్రం ఎంతగానో నచ్చింది. సాంగ్ రికార్డింగ్ అయ్యాక కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి.. ఇంతమంచి గొంతుని నాకు పరిచయం చేసినందుకు చాలా థాంక్స్, ఆభాస్ జోషి పాడుతుంటే ఈ పాటకు రెండు చరణాలు కాకుండా యాభై చరణాలు ఉంటే బాగుండు అనిపించి అన్నారు. అప్పుడు నేను షూటింగ్ లో ఉన్నాను. షూటింగ్ అవ్వగానే వెంటనే వెళ్లి పాట విన్నాను. ఈ పాట చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి. ఇంత అద్భుతమైన పాటని స్వరపరిచిన కళ్యాణ్ గారికి, లిరిక్స్ రాసిన లక్ష్మీ భూపాల గారికి ధన్యవాదాలు. ఆభాస్ జోషిని సింగర్ గా తెలుగులో పరిచయం చేయడం గర్వంగా ఉంది” అన్నారు.
 
సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నాకు అంత్యంత ఇష్టమైన సినిమా, అంత్యంత మంచి సినిమా. ఇందులోని ‘కనుల చాటు మేఘమా’ అనే పాట నాకు ఎంతో ఇష్టమైనది. శ్రీనివాస్ గారు ఈ పాట సందర్భాన్ని వివరించినప్పుడు ‘లగ్ జా గలే’ అనే అద్భుతమైన పాటను రిఫరెన్స్ గా తీసుకోమని చెప్పారు. అంత గొప్ప పాట స్థాయిని అందుకోవడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. ఈ పాట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పాట ఇవ్వలేదు. ఈ పాట చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. లక్ష్మీ భూపాల గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాట విన్నాక లక్ష్మీ భూపాల గారితో నేనొక మాట అన్నాను. మీరు, ఈ పాట పాడిన ఆభాస్ జోషి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పాను. ఆభాస్ జోషి పేరుని శ్రీనివాస్ గారు సూచించారు. ఆయన గొంతు వినగానే నా మతిపోయింది. ప్రతి పాటని ఇదే నా చివరి అవకాశం అన్నట్లుగా ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో పాడతాడు. అంత గొప్ప గొంతుని పరిచయం చేసిన శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఇంత మధురమైన గొంతు చాలా అరుదుగా వింటాం. హిందీ గాయకుడు అయినప్పటికీ తెలుగు ఉచ్చారణ ఎంతో అద్భుతంగా పలికాడు. ఈ సినిమాతో పాటు, ఈ సినిమాలో పాటలు చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని నమ్ముతున్నాను. శ్రీనివాస్ గారితో పనిచేయడం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను” అన్నారు.
 
నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – – శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్
 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News