Wednesday, January 22, 2025

రూ.500ల నుంచి రూ.1000 కోట్ల జీఎస్టీని ఎగ్గొడుతున్న ఫార్మా కంపెనీలు

- Advertisement -
- Advertisement -

బిల్లులు లేకుండానే ఇతర రాష్ట్రాలకు
లారీల్లో స్పెంట్ సాల్వేంట్ తరలింపు
కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు భారీగా ముడుపులు
ఆడిట్ చేయని అధికారులు
ప్రభుత్వానికి ఫిర్యాదు

మనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని ఫార్మా కంపెనీలు జిఎస్టీ ఎగ్గొడుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పెద్ద ఫార్మా కంపెనీలతో పాటు చిన్న ఫార్మా కంపెనీలు జీఎస్టీ ఎగవేతలో ముందంజలో ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలు రికవరీ సాల్వెంట్ బై ప్రొడక్ట్ (స్పెంట్ సాల్వేంట్)ను ఇతర రాష్ట్రాలకు విక్రయించి తెలంగాణకు రావాల్సిన జీఎస్టీని కోట్లలో కొల్లగొడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు స్పెంట్ సాల్వేంట్ విక్రయించినప్పుడు బిల్లులు లేకుండానే కొన్ని ఫార్మా కంపెనీలు గుజరాత్, కర్ణాటక, ఎపిలకు లారీల్లో తరలించాయని దీనివల్ల ఒక్కో ఫార్మా కంపెనీ వాణిజ్య పన్నుల శాఖకు ఇప్పటికే రూ.500ల కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు జిఎస్టీని ఎగ్గొట్టాయని బయటపడింది. ఈ విషయంలో కొందరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ముడుపులు ముడుతున్నాయని అందుకే ఆయా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆడిట్ పేరుతో అందినంత దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రికి, సిఎస్‌లకు ఫిర్యాదు

మాములుగా ఫార్మా కంపెనీల నుంచి వచ్చే రికవరీ సాల్వెంట్ బై ప్రొడక్ట్ (స్పెంట్ సాల్వేంట్)ను తెలంగాణలోని వ్యాపారులకు మాత్రమే విక్రయించాలని నిబంధనలు ఉన్నా దానిని మనరాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై కొందరు తెలంగాణ ఇండస్ట్రీయల్ స్పెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతోపాటు పిసిబి అధికారులకు, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫిర్యాదు చేశారు. ఆ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పుడు కమర్షియల్ ట్యాక్స్‌కు ఆయా ఫార్మా కంపెనీలు జీఎస్టీ ఎగ్గొట్టిన విషయం బయటపడింది. ఇలా వందల కోట్ల జీఎస్టీని ఆయా ఫార్మా కంపెనీలు ఎగ్గొట్టినప్పుడు ఆయా కంపెనీలకు కోట్ల రూపాయలను జరిమానా వేయాల్సి ఉంటుంది. అయినా ఈ విషయాన్ని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని, కనీసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా రాబట్టుకోవడంలో వారు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లీటర్ స్పెంట్ సాల్వేంట్ ధర రూ.40 నుంచి రూ.800లు

మాములుగా లీటర్ స్పెంట్ సాల్వేంట్ ధర రూ.40 నుంచి రూ.800ల ధర పలుకుతుంది. దాని స్థాయిని బట్టి దానికి ధరను నిర్ణయిస్తారు. రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు వాటి స్థాయిని బట్టి నెలకు 20 నుంచి 30 వేల లీటర్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాయని సమాచారం. ఈ స్పెంట్ సాల్వేంట్‌ను కొనుగోలు చేసే వారు దానిని శుద్ధి చేసి సిరామిక్ టైల్స్‌లోనూ, డాంబర్ రోడ్డు వేసేటప్పుడు తదితర అవసరాలకు వినియోగిస్తారు. ఇలా వివిధ రకాలుగా దీని వినియోగం ఉండడంతో దాని స్థాయిని బట్టి ధరను చెల్లించడానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలోని ఫార్మా కంపెనీలను సంప్రదిస్తున్నారు.

ఈ వ్యాపారానికి స్పందన భారీగా ఉండడంతో ఫార్మా కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయించాల్సి వస్తే 20 శాతం మాత్రమే వారికి అవకాశం ఇచ్చి, మిగతా 80 శాతం విక్రయం మాత్రం తెలంగాణలో జరపాలన్న పిసిబి నిబంధనలను ఫార్మా కంపెనీలు తుంగలో తొక్కి అందినకాడికి దోచుకుంటున్నాయని, దీంతోపాటు జీఎస్టీ ఎగ్గొడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News