Thursday, January 23, 2025

బాధ నుంచి లాభాలు!

- Advertisement -
- Advertisement -

Pharma companies profit with Corona virus

కరోనా కరాళ నృత్యం చేసిన కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు మరింత సంపన్నులై పేదలు ఇంకా పేదరికంలో కూరుకుపోయారని అనుకుంటున్నదే. అలాగే ఉపాధులు, ఉద్యోగాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదనేది కూడా సుస్పష్టమే. ఈ రెండు బాధాకరమైన పరిణామాలను ధ్రువపరుస్తూ వేర్వేరుగా రెండు కీలక నివేదికలు సోమవారం నాడు వెలువడ్డాయి. ప్రతి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలచుకోగల శక్తియుక్తులు పెట్టుబడిదారులకి వుంటాయన్నది తెలిసిందే. కరోనా కాలంలో ప్రతి 30 గం.లకు ఒక కొత్త బిలియనీర్ తయారై శతకోటీశ్వరుల సంఖ్య బాగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ (ఆక్స్‌ఫర్డ్ కరువు నివారణ కమిటీ) వెల్లడించింది.

‘బాధ నుంచి లాభాలు చేసుకోడం’ అనే శీర్షికన ఈ నివేదిక వెల్లడైంది. 2022 తొలి త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 11.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి వుంటారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) మానిటర్ తొమ్మిదవ సంచిక నిర్ధారించింది. దావోస్‌లో ఐదు రోజుల పాటు జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ‘బాధ నుంచి లాభాలు చేసుకోడం’ నివేదికను ఆక్స్‌ఫామ్ ప్రచురించింది. కరోనా కాలంలో ప్రతి 30 గం.లకు ఒకరు చొప్పున 573 మంది కొత్తగా బిలియనీర్లు అయ్యారని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలియజేసింది. అలాగే ఈ ఏడాది ప్రతి 33 గం.లకు 10 లక్షల మంది వంతున 263 మిలియన్ (2 కోట్ల 63 లక్షలు) మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతారని తెలియజేసింది. ప్రపంచ బిలియనీర్ల సంపద గత 23 ఏళ్లలో పెరిగిన దాని కంటే ఎక్కువగా కొవిడ్ బయటపడిన 24 మాసాల్లో పెరిగిందని ఈ నివేదిక వివరించింది.

కరోనా కాలంలో ఫార్మారంగంలో 40 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారు. మోడెర్నా, ఫైజర్ వంటి ఫార్మా కార్పొరేషన్లు కొవిడ్ టీకాలపై గుత్తాధిపత్యం ద్వారా ప్రతి సెకనుకు 1000 డాలర్ల లాభం సంపాదించాయని ఆక్స్‌ఫామ్ తెలియజేసింది. కొవిడ్ కాలంలో మహిళలను ఉద్యోగాల నుంచి భారీ ఎత్తున తొలగించిన విషయాన్ని అది ధ్రువపరిచింది. 2019తో పోల్చుకుంటే 2021లో 13 మిలియన్ల (కోటి 30 లక్షలు) తక్కువ మహిళా ఉద్యోగులున్నారని వెల్లడించింది. పురుషులు, మహిళల మధ్య వేతన వ్యత్యాసం కూడా పెరిగిందని ఈ నివేదిక బయటపెట్టింది. భారత దేశంలో స్త్రీలు ఉద్యోగాల్లో చేరడాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీసినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక కూడా స్పష్టం చేసింది.

కొవిడ్‌కు ముందు ఉద్యోగాల్లో వున్న ప్రతి వంద మంది మహిళల్లో 12.3 మంది కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయినట్టు కార్మిక సంస్థ వెల్లడించింది. అదే సమయంలో ప్రతి 100 మంది పురుషుల్లో నిరుద్యోగులైన వారు 7.5 మంది మాత్రమే. రెండు నివేదికలు భారత దేశంలో ఉద్యోగ రంగం నుంచి మహిళల భారీ ఎత్తు వెలిని ధ్రువపరిచాయి. ప్రపంచమంతటా ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు పెట్టుబడికి ప్రోత్సాహమిస్తూ ప్రభుత్వాల పాత్రను తగ్గించి వేశాయి. ప్రజల మేలు కోసం ఉద్దేశించిన సంస్కరణోద్యమంగా దీనిని అభివర్ణించారు. వాస్తవంలో చూస్తే ప్రభుత్వం వద్దనున్న ప్రజల సంపద కరిగిపోయి ప్రైవేటు రంగం విశేషంగా లాభపడుతున్నది. అదే సమయంలో ప్రజల శ్రమ శక్తికి విలువ, రక్షణ లేకుండాపోయింది. పూర్వమున్న పర్మనెంట్ ఉద్యోగావకాశాలు దాదాపు మూతపడిపోయాయి. ఇది ప్రజల జీవితాల్లో ఎంతటి సంక్షోభాన్ని తీసుకు వచ్చిందో ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాము. జీవన స్థిరత్వం లోపించడంతో అభద్రతా భావం పెరిగిపోయి నేర ప్రవృత్తి కోరలు చాచడం మొదలు పెట్టింది. ఈ రెండు నివేదికలలోని అంశాలను పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ మితిమించిన స్వార్థం జన జీవితాల్లోని శాంతిని, సుస్థిరతను బలి తీసుకున్నదని సందేహాతీతంగా రుజువవుతుంది.

బిలియనీర్ల సంపద ఇంతగా పెరగడానికి వారు గతం కంటే ఎక్కువగా శ్రమించడం కారణం కాదని, దశాబ్దాలుగా సంపన్నులు వ్యవస్థను పాదాక్రాంతం చేసుకున్నారని దాని నుంచి విశేష ప్రయోజనాలను ఇప్పుడు పొందుతున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక అభిప్రాయపడింది. కార్మికులు అధిక కష్టాన్ని భరిస్తూ, దుర్భరమైన జీవన పరిస్థితుల్లో గతంలో కంటే తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని అభిప్రాయపడింది. సంపన్నులు ప్రభుత్వాల మద్దతుతో కార్మికుల హక్కులను హరించడం ద్వారా విశేషంగా సంపాదించి విదేశాల్లోని సురక్షితమైన బ్యాంకు ఖాతాల్లోకి తరలిస్తున్నారని కూడా వివరించింది. దేశ వికాసాన్ని ఆర్థిక వృద్ధి రేటులో చూడ్డానికి బదులు ప్రజల పెదాల మీద నాట్యం చేసే నవ్వుల్లో చూసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు భిన్నంగా ప్రజల శ్రమను, భవిష్యత్‌ను పెట్టుబడిదార్ల లాభాల వేటకు బలి చేయడమే వర్తమానంలో ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న విషాదం. భారత దేశంలో ఇది మరింత ఎక్కువగా, ముమ్మరంగా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News