నగరాన్ని సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం ఫ్యూచర్‌సిటీ కిందే
గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి త్వరలో ఫ్యూచర్, ఎఐ సిటీలు దేశంలో అతిపెద్ద
ఎలక్ట్రానిక్ వాహనాల కేంద్రంగా అవతరించిన హైదరాబాద్ బయో ఏషియా
సదస్సును ప్రారంభించిన అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్
యూనివర్శిటీ ఏర్పాటు రాష్ట్ర ఐటి, పరిశ్రమశాఖల మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో మిగతా రాష్ట్రాలకంటే ముందున్నామని, హైదరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని, వాటి ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన చొరవ అయిన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు-జరుగుతోందన్నారు. మంగళవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బయో ఆసియా 2025 సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందని, ఈ రంగానికి సంబంధించి నగరంలో గొప్ప నిపుణులున్నారన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయని, భారత్‌లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా నగరం మారిందన్నారు.
ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం : హైదరాబాద్‌ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామని, రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి మంచి పేరుందని, విదేశీ వర్సిటీల నిపుణులు ఫార్మా రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తోందని, ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఇక్కడి ఎకో సిస్టమ్ అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తోందని, తమ ప్రభుత్వ విధానాలు చూసి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. బయో ఏషియా సదస్సు హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసేలా దేశ విదేశాలను ఆకర్షిస్తోందన్నారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయన్నారు. ముందునుంచి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోందని, తాము ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామన్నారు. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశామని, జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామన్నారు.
సేవల రంగానికి ప్రాధాన్యత : హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామన్నారు. దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించిందని, దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయని, 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నామన్నారు. కోర్ సిటీ వెలుపల అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతామని, చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని, ఓఆర్‌ఆర్..ఆర్‌ఆర్‌ఆర్..ఈ రెండు రింగ్‌లను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామని, ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం అని, ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్ కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు.
పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ : బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామని, హైదరాబాద్ లో అమ్జెన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించిందని, ఇది తమ సహకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, తమతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నామన్నారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందన్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో, తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, విభిన్న రంగాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయన్నారు.
పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం : గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామని, దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయన్నారు. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని, జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్ , జన్యు చికిత్సను ప్రారంభించిందన్నారు. ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామని, గత 25 సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్‌గా పేరు నిలుపుకుందని చెప్పారు. గత ఏడాది ఏఐ హెల్త్‌కేర్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా కోర్సులకు రూపకల్పన చేయబోతున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచ పటంలో తెలంగాణ ను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్ళిందన్నారు. ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదని, రెండు దశాబ్దాల కిందట మొదలైందని, ఈ స్ఫూర్తి తో తెలంగాణ బ్రాండ్ ను విశ్వ వ్యాప్తం చేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ను నంబర్ వన్ గా మార్చడం లో జీనోమ్ వ్యాలీ పాత్ర కీలకమన్నారు. ‘హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్‘ జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రత్యక్షంగా 51వేల మందికి, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సైన్సెస్ పరిశ్రమల కు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణలో రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నామని, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ పై ఉన్న నమ్మకం, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పై ఉన్న భరోసా ను చాటి చెప్పేందుకు ఈ ఒక్కటి చాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు తోనే ఆగిపోమని, రాష్ట్ర ప్రభుత్వం వారితో కలిసి పని చేస్తుందన్నారు. యూనివర్సిటీ లు, స్టార్టప్, పరిశోధన సంస్థ లతో భాగస్వామ్యమయ్యేలా ప్రోత్సహిస్తామని, కొత్త ఆలోచనలకు అండగా ఉంటామని, ఎంఎస్‌ఎంఈ లను ప్రోత్సహించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనరిక్ మందుల్లో తెలంగాణ వాటా 20 శాతం, వ్యాక్లిన్ల ఉత్పత్తి లో మన వాటా 40 శాతం. 200 కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీ సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా స్వాంతన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని చెప్పారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దుతామన్నారు.
ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు తెలంగాణలో తమ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్, ఆర్‌అండ్ డీ, జీ సీసీ లను ప్రారంభించాయని, మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ఫలితంగా లైఫ్ సైన్సెస్ గ్లోబల్ సప్లై చెయిన్ లో తెలంగాణ వాటా మరింత పెరిగిందన్నారు. ఆస్ట్రేలియా – క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ, యూకే కి చెందిన ఎన్ హెచ్‌ఎస్, టీ హబ్ తో ఎంవోయూ చేసుకున్నామని, గ్రాన్యూయల్స్, భారత్ బయోటెక్, ఆజియంట్, బయోలాజికల్ బీఈ తదితర దేశీయ, విదేశీ దిగ్గజ ఫార్మా సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామన్నారు. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యనుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్స్(సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతోందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని శ్రీధర్‌బాబు తెలిపారు.