Monday, December 23, 2024

పకడ్బందీగా పోలీసుల ఎంపిక ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసు అభ్యర్థుల శారీరక పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. హైకోర్టు తీర్పు మేరకు 7మార్కులు కలపడం, 1 సెంటీమీటర్ ఎత్తులో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించడంతో 11,485మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ అభ్యర్థులకు కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ శారీరక దేహదారుడ్య పరీక్షలకు 8,300మంది పురుషులు, 3,185మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. మహిళా అభ్యర్థులకు ఈ నెల 16,17,19 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థుల ఎత్తుకొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నామని, పురుషులకు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యేలా రెస్ట్‌బ్యాండ్‌లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. సిపి వెంట జాయింట్ సిపి అవినాష్ మహంతి, టిఎస్‌ఎస్‌పి వరంగల్ కమాండెంట్ సిధూశర్మ, డిసిపి ఎల్‌సి నాయక్, కొండాపూర్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

మోస పూరిత మాటలు నమ్మవద్దు: స్టిఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సిపి

పోలీసు ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా కొనసాగుతోందిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని అంశాలు సిసి కెమెరాల్లో రికార్డు అవుతుందని తెలిపారు. ఫుటేజ్‌ను భద్రపరుస్తామని, ఏమైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అభ్యర్థులను గ్రౌండ్‌లోకి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు ఫోన్లు, ఇతర వస్తువులు తీసుకుని రావద్దని, వాటిని భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మెడికల్ క్యాంప్, అత్యవసర సమయంలో అంబులెన్స్, టాయిలెట్స్, మంచినీటి సదుపాయం కల్పించామాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News