ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలలో 62.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.97 శాతం తక్కువని తెలిపింది. సోమవారం(మే 20) సాయంత్రానికి ఐదవ దశ ఎన్నికలు ముగియడంతో ఇప్పటి వరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 428 లోక్‌సభ నియోజకవర్గాలలో పోలింగ్ పూర్తయింది. మే 25, జూన్ 1న జరగనున్న మిగిలిన రెండు దశలతో ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
2019 ఎన్నికల ఐదవ దశలో 51 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 64.16 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగవ దశలో 69.19 శాతం పోలింగ్ నమోదు కాగా మూడవ దశలో 65.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. రెండవ దశలో 69.64 శాతం పోలింగ్ నమోదు కాగా మొదటి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు, వాటిని మొత్తం ఓటింగ్ శాతానికి కలపాల్సి ఉంటుందని, ఈ కారణంగా ఫలితాలు వెలువడిన తర్వాతే తుది ఓటింగ్ శాతం తెలుస్తుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.