Sunday, January 19, 2025

రాజ్యసభలో రూ. 2000 నోట్ల రద్దుకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రూ. 2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని సోమవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. అలాంటి నోట్లను కలిగిన వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా సూచించారు. శూన్యకాలంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. చాలా ఏటిఎంలలో రూ. 2000 కనిపించకుండా పోయాయన్నారు. అవి ఇక చెల్లుబాటు కావన్న వదంతులు కూడా దేశంలో వ్యాపిస్తున్నాయన్నారు.

“ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టత ఇవ్వాలి” అన్నారు. అంతేకాక ఆర్‌బిఐ మూడేళ్ల కిందటే రూ. 2000 నోట్లను ముద్రించడం ఆపేసిందని కూడా తెలిపారు. ప్రభుత్వం నోట్ల రద్దు(డీమానిటైజేషన్) ప్రకటించి నాడు రాత్రికిరాత్రే పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత రూ. 500, రూ. 2000 కొత్త నోట్లను ప్రచురించింది. “రూ. 1000నోట్లను రద్దు చేసి, రూ. 2000 నోట్లను చలామణిలోకి తేవడంలో లాజికే లేదు” అని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పెద్ద నోట్లు(హయ్యర్ డినామినేషన్ నోట్లు) లేవన్న ఉదాహరణలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

రూ. 2000 నోట్లను అక్రమంగా దాపెట్టడానికి, మాదకద్రవ్యాలు వంటి అక్రమ వ్యాపారాలు చేయడానికి, మనీ లాండరింగ్‌కు ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో రూ. 2000 అత్యధిక డినామినేషన్ నోటన్నారు. అది ఎక్కువ వరకు నల్ల ధనంగా వాడుకునేందుకు ఉపయోగపడుతోందన్నారు. ప్రభుత్వం దశలవారీగా దానిని రద్దుచేయాలని సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు. వాటిని పౌరులు మార్చుకునేందుకు వీలుగా రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News