నెలరోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
కాన్పూర్(యుపి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్‌కు చెందిన 29 సంవత్సరాల పిహెచ్‌డి వ్యిర్థిని ఒకరు గురువారం తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐఐటి కాన్పూర్ క్యాంపస్‌లో నెలరోజుల్లో ఇది మూడవ ఆత్మహత్య ఘటనగా పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని దుంకాకు చెందిన ప్రియాంక జైస్వాల్ కెమికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 29న ఐఐటి కాన్పూర్‌లో ఆమె చేరారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు తమకు సమాచారం అందిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ప్రియాంక జైస్వాల్ తన గదిలోపల నుంచి గడియ పెట్టుకున్నారని అదరనపు డిసిపి(పశ్చిమ) అకాష్ పటేల్ తెలిపారు. తలుపులు పగలగొట్టి చూడగా సీలింగ్ ఫ్యానుకు వేళ్లాడుతూ ఆమె మృతదేహం కనిపించిందని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది.
ఆమె మరణానికి గల కారణాలు దర్యాప్తులో తేలవలసి ఉంటుందని పటేల్ తెలిపారు. కాగా..జనవరి 11న ఐఐటి కాన్పూర్‌లో ఎంటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్ కుమార్ మీనా(31) తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డిసెంబర్ 19న పల్లవి చిల్కా(34) అనే పోస్టడాక్టోరల్ రిసెర్చర్ తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.