గుజరాత్‌లోని లోథాల్‌లో పురావస్తు స్థలం సమీపంలో బుధవారం ఉదయం నలుగురు వ్యక్తులు ఒక గోతిలోకి ప్రవేశించినప్పుడు మట్టిచరియ విరిగి వారిపై పడగా ఐఐటి ఢిల్లీ విద్యార్థి మృతి చెందగా, తక్కిన ముగ్గురూ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్‌కు సుమారు 80 కిమీ దూరంలోని ప్రాచీన సింధు లోయ నాగరికత స్థలం వద్ద ఐఐటి ఢిల్లీ పిహెచ్‌డి స్కాలర్ సురభి వర్మ (23), ఇతర బాధితులు ఉండగా ఆ దుర్ఘటన సంభవించిందని పోలీసులు తెలిపారు. ఐఐటి ఢిల్లీ నుంచి ఇద్దరు, ఐఐటి గాంధీనగర్ నుంచి ఇద్దరు వెరసి నలుగురు పరిశోధకుల
బృందం అధ్యయనానికి మట్టి నమూనాల సేకరణకు హరప్పా రేవు పట్టణం లోథాల్‌లో పురావస్తు శిథిలాల సమీపంలో ఉన్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ (గ్రామీణ) ఓమ్ ప్రకాశ్ జాట్ తెలియజేశారు. ఆ నలుగురూ తమ అవసరం కోసం తవ్విన పది అడుగుల లోతు గోతిలోకి వెళ్లినప్పుడు దాని గోడ కూలిపోయిందని, వారు మట్టి కింద చిక్కుకుపోయారని పోలీస్ అధికారి తెలిపారు. ‘సురభి వర్మగా గుర్తించిన ఐఐటి ఢిల్లీ రీసర్చర్ అక్కడికక్కడే మరణించగా, మరి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి స్థిరంగా ఉంది’ అని ఆయన చెప్పారు.