అనేక మంది గల్లంతు!!
మనీలా: ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వేలాది మంది ఇప్పటికీ ఎమర్జెన్సీ షెల్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పటి వరకు వరదలకు 51 మంది మృతి చెందగా, 19 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం తెలిపారు. దక్షిణ మిసామిస్ ఆక్సిడెంటల్ ప్రావిన్స్‌లో ఇళ్లు మందపాటి బురదలో కొట్టుకుపోవడం వంటి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సముద్రతీర గ్రామమైన కాబోల్‌అనోనాన్‌లో కొబ్బరి చెట్లు నేలకూలాయి, తేలికపాటి మెటీరియల్‌తో చేసిన గుడిసెలు దాదాపు చదునయిపోయాయి.
ఉత్తర మిండానోవా ప్రాంతం విపత్తుకు బాగా నష్టపోయిందని, దాదాపు 25 మంది చనిపోయారని అక్కడి జాతీయ విపత్తు నివారణ, నిర్వహణ మండలి తెలిపింది. చనిపోయిన వారిలో చాలా వరకు మునిగిపోవడం, కొండచరియలు విరిగిపడ్డం వల్ల చనిపోయారు. తప్పి పోయినవారిలో తమ పడవలు బోల్తాపడిన మత్సకారులున్నారు.
ప్రస్తుతం వరద ముప్పు చాలా వరకు నెమ్మదించింది. కానీ ఇప్పటికీ 8600కు పైగా ప్రజలు షెల్టర్స్‌లోనే ఉన్నారు. 4500పైగా ఇళ్లు వరదలకు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ త్రాగునీరు, విద్యుత్ సరఫరాలేదు. దాదాపు 22 నగరాలు, మున్సిపాలిటీలను విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. వీటికి అత్యవసర నిధులు, పునరావాస ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.