Sunday, November 17, 2024

ఫోన్‌ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలిః బండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విశ్వసనీయతను నిరూపించుకునేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిందేనన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు వెల్లడై, అసలు దోషులకు శిక్ష పడాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని అన్నారు. ఈ కేసులో కెసిఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించకపోతే దీని వెనుక హస్తం పార్టీకి సంబంధం ఉన్నట్లే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ విషయం ఇప్పటికే ప్రజలకు అర్ధమైందని అన్నారు. అరెస్టులు, రిమాండ్‌లు అన్నీ జరిగాయని, అయితే కేసు తీవ్రతను తగ్గించి క్రమంగా నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందునుంచే ఫోన్‌ట్యాపింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన రాధా కిషన్‌రావు విచారణ సందర్భంగా చెప్పారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు తనతోపాటు రేవంత్‌రెడ్డి, అప్పటి మంత్రి హరీశ్‌రావు కూడా బాధితుడేనని, ప్రతిపక్షం, స్వపక్షం అని తేడా లేకుండా అవసరమైన అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని అన్నారు. ఈ కేసు దేశ భద్రత దృష్టా ఎంతో కీలకమని చెబుతూ గతంలోనూ అనేక కేసుల్లో సిట్‌లు వేయడం, ఆ తర్వాత సరైన చర్యలు తీసుకోకుండా మూసివేయడం జరిగిందని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ కేసు కూడా అదే దారిలో వెళుతోందని, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించి సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

317 జివొ, టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ సమయంలో తనను అరెస్టుచేయడం వెనుక కూడా ఫోన్‌ట్యాపింగ్ ఒక కారణమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక కెసిఆర్, కెటిఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. అయితే ఈ కేసులో వాస్తవాలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో ఆయన కుమారుడు కెటిఆర్‌కు తెలియకుండానే సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News