Sunday, April 6, 2025

పలుచనైపోతున్న పాత్రికేయం

- Advertisement -
- Advertisement -

ఏది పాత్రికేయం, ఎవరు అసలు సిసలు పాత్రికేయులు… ఈ ప్రశ్నలు తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రమే కాదు, ఎందరో పాత్రికేయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 1984 నుంచి రెండు దశాబ్దాల కాలంలో పత్రికా రంగం ఎన్నో విప్లవాత్మక మార్పులను చవిచూసింది. హ్యాండ్ కంపోజింగ్ దశనుంచి ఫోటో కంపోజింగ్ వరకూ ఎదిగింది. అప్పటి వరకూ కలం పట్టి మరీ ఏజెన్సీ కాపీలను తర్జుమా చేస్తూ వచ్చిన ఉపసంపాదకులు ఆ తరువాతి కాలంలో (కంప్యూటరైజేషన్ పుణ్యమా అంటూ) దశకంఠుడి తలల్లా పది రకాల బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది. 2000 దశకం నాటికే జర్నలిజంలో విలువల పతనంతో నాలుగో స్తంభం బీటలు వారడం ప్రారంభమైంది. రాజకీయం వచ్చి పాత్రికేయాన్ని కబ్జా చేయటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. యాజమాన్యం బాణీకి అనుగుణంగా దరువు వేసే కళాకారులుగా పాత్రికేయులు దిగజారిపోవాల్సి వచ్చింది.

పాత్రికేయులు, పత్రికా స్వేచ్ఛ అన్నపదాలు రాజకీయ నాయకులు, వారి కొమ్ముకాసే వ్యక్తుల యాజమాన్యంలోని పత్రికలు, ప్రసార మాధ్యమాల సొత్తుగా పరిణామం చెందాయి. జర్నలిస్టుల హక్కుల కోసం అప్పటి వరకూ పోరాడుతూ వచ్చిన సంఘాలు సైతం నిస్సహాయ స్థితిలో పడిపోయాయి. మన వ్యవస్థలో ఓ డాక్టర్, ఓ టీచర్, ఓ సైనికుడు, ఓ పోలీసు, ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు కావాలంటే తగిన అర్హతలతో పలు రకాల పరీక్షలను అధిగమించి తీరాలి. అదే ఓ రాజకీయ నాయకుడో, జర్నలిస్టో కావాలంటే ప్రస్తుత కాలంలో గోరంత ప్రతిభ, కొండంత అదృష్టం మినహా ఏ విధమైన అర్హతలతో పనే లేకుండాపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా ఆగమనంతో అది పరాకాష్ఠకు చేరింది. ముందొచ్చిన చెవుల కన్న వెనకొచ్చిన కొమ్ములువాడి అన్నట్లుగా తయారయింది.

ఆ తర్వాతి కాలంలో తగిన అర్హతలు, సామర్థ్యం లేకున్నా కుప్పలు తెప్పలుగా జర్నలిస్టులు పుట్టుకువచ్చారు. ప్రపంచీకరణ, మీడియా విప్లవంతో చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టుగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సెల్ ఫోన్లు ఉన్న ఇంటికో జర్నలిస్టు ఉన్నారన్నా అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. జర్నలిజం గురించి, విలువల గురించి కనీస అవగాహనలేని వారికి స్వీయ నియంత్రణ, లక్ష్మణ రేఖలు గురించి తెలుస్తాయనుకోడం అత్యాశే అవుతుంది. యజమానులకు, యాజమాన్యాలకు, రాజకీయ వర్గాలకు నచ్చినవారే పాత్రికేయులు కావడం గత రెండు దశాబ్దాల కాలంలో చోటు చేసుకొన్న విషాదం. దేశంలోనే అత్యధికంగా 24 వేల మంది (ప్రభుత్వ గుర్తింపు పొందిన) జర్నలిస్టులు మన రా్రష్ట్రంలో ఉన్నారంటే ముక్కుమీద వేలేసుకోక తప్పదు.

అసలు సిసలు జర్నలిస్టులు తెర వెనుక చాలీచాలని జీతాలు, అవమానాలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే కొందరు కొసరు, ప్రాపకపు జర్నలిస్టులు మాత్రం తెరముందు తమ అజ్ఞానం ప్రదర్శిస్తూ పాత్రికేయ విలువల్ని ఆరునిలువుల లోతున పాతిపెడుతున్నారు. పాత్రికేయ వృత్తినే నవ్వులాట స్థాయికి దిగజార్చిన సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుత జర్నలిజంలో విలువలను పరిరక్షించాలంటే జర్నలిస్టు అన్నపదానికి స్పష్టమైన అర్హత, ఖచ్చితమైన నిర్వచనాన్ని ఇవ్వాల్సిన గురుతర బాధ్యత పాత్రికేయ పెద్దలపైన ఉంది. అసలు సిసలు జర్నలిస్టులను గుర్తించే సమయంలో ప్రభుత్వ వ్యవస్థలు రాజీలేని ధోరణిలో వ్యవహరించాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది.

జర్నలిజం పేరుతో దందాలు చేసేవారిని, నకిలీ జర్నలిస్టులను కటకటాల వెనుకకు పంపే పరిస్థితి రావాలి. జర్నలిస్టులు కానివారి చేతిలో అక్రిడిటేషిన్ కార్డు ఉంటే మంజూరు చేసినవారిపైన, పొందినవారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆదర్శవంతమైన పాత్రికేయులు రావాలంటే ఆదర్శవంతమైన వ్యక్తులు, యజమానుల చేతిలో మీడియా సంస్థలు, వ్యవస్థలు ఉండి తీరాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడుతుందా? అంటే సాధ్యం కాదనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News