Monday, December 23, 2024

సత్యశోధక్ స్ఫూర్తిని ఆవాహన చేద్దాం

- Advertisement -
- Advertisement -

ఇవ్వాళ దేశమంతటా మనువాదం, బ్రాహ్మణాధిపత్యం రాజ్యమేలుతున్నది. సహనశీలత, సంయమనం నశించి ప్రశ్నించేవారి కుత్తుకలను ఉత్తరిస్తున్నది. హిందూత్వానికి ప్రతీకగా ‘శివాజీ’ని ప్రచారంలో పెడుతున్నారు. అసత్యాలను ప్రాచుర్యంలో పెడుతూ వాటిని సాక్ష్యాధారాలతో ఎండగట్టిన దబోల్కర్ లాంటి వారిని హతమారుస్తున్నారు. నిజానికి శివాజీ సమాధిని ‘రాయ్‌గఢ్’లో వెతికి, వెలుగులోకి తెచ్చి పునరుద్ధరించిన వాడు మహాత్మ జ్యోతిరావు ఫూలే. తర్వాతి కాలంలో అక్కడ ప్రతి యేటా జయంతి ఉత్సవాలను నిర్వహించాడు. మనువాద భావజాలానికి వ్యతిరేకంగా, ‘గులాంగిరి’, ‘తృతీయరత్న’ రాసి బహుజనుల పక్షాన నిలబడ్డాడు. ఇట్లా బ్రాహ్మణాధిపత్యానికి తావు లేకుండా చేసేందుకు ఫూలే సరిగ్గా 150 ఏండ్ల క్రింద ‘సత్యశోధక్ సమాజ్’ని ఏర్పాటు చేసిండు. అయితే ఫూలే చనిపోయిన తర్వాత అదే పుణెలో గణపతి ఉత్సవాలను ప్రారింభించింది బాలగంగాధర్ తిలక్.దాన్ని జాతీయోద్యమానికి జోడించి హిందూత్వాన్ని రాజకీయాల్లోకి మొదట జొప్పించింది కూడా తిలకే. ఇప్పుడు అదే హిందూత్వ ఆధిపత్యవాదం రాజ్యమేలుతోంది. సకల ఆధిపత్యాలను ఎదుర్కొనేందుకు ఇవ్వాళ ‘సత్యశోధక్ సమాజ్’ని స్ఫూర్తిగా తీసుకోవాలి.

ఈ సంస్థ స్థాపితమై 150 ఏండ్లయిన సందర్భంగా దాని గురించి ఇక్కడ చర్చించుకుందాం! దీపధారుల్ని స్మరించుకుందాం!!
ఆధునికతకు దారి చూపిన దీపధారుల్ని, వారు నిర్వహించిన సంస్థల్ని స్మరించుకోవాలె. మనువాదానికి కౌంటర్‌గా బహుజనుల బాగోగుల కోసం ఏర్పాటైన సంస్థ సత్యశోధక్ సమాజ్. రిజర్వేషన్ల కోసం, బహుజనుల, మహిళల అభ్యున్నతి కోసం పరితపించిన ఆధునిక మహాత్ముడు జ్యోతిబా ఫూలే!ఆధునిక యుగంలో నిజంగా అట్టడుగు వర్గాలవారి మేలు కోరి ఉద్యమాలు చేసిన మహాత్ముడు, బహుజన బాంధవుడు. బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా బిసిలు, దళితులను సంఘటిత పరచి పోరాటం చేసిన మహనీయుడు. తన కార్యాచరణ, రచనల ద్వారా కింది కులాలవారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరముంది. ముఖ్యంగా తెలుగు పాఠకులకు తెలియాల్సిన విషయాలు చాలా వున్నాయి. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఫూలే ఏర్పాటు చేసిన సంస్థ ‘సత్యశోధక్ సమాజ్’. ఈ సంస్థ స్థాపన, నిర్వాహణ, ప్రచారంలో మిగతా అన్ని వర్గాల వారితో పాటు తెలుగు ప్రాంతాల నుంచి వలసబోయిన వారు కూడా కీలక భూమిక పోషించారు. ‘సత్యశోధక్ సమాజ్’ 1873 సెప్టెంబర్ 24న పూణెలో ఏర్పాటయింది.

ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.
1. భట్, జోషీ తదితర బ్రాహ్మణులు చేయించుకుంటున్న వెట్టిచాకిరికీ వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని కూడగట్టి వ్యతిరేకించడం. 2. బ్రాహ్మణులు తమ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్న ‘పవిత్ర పుస్తకాల’ మాయా ప్రభావంలో చిక్కుకోకుండా ఉండేందుకు ‘శూద్రుల’కు విద్యను అందుబాటులోకి తేవడం, విద్యావంతులుగా తీర్చి దిద్దడం. తమ హక్కులను తెలుసుకునేలా చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం. 3. మతం పేరిట అసమానతలు సృష్టించి దోపిడీకి పాల్పడే బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించడం. ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ‘శూద్రులు, అతి శూద్రుల’ను సంఘటితం చేయడం సంస్థ లక్ష్యాల్లో ప్రధానమైనది. ఇది ఫూలే ప్రచారం చేస్తూ వచ్చిన భావజాల ప్రచారంలో ముఖ్యమైనది కూడా! 4. బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. కొన్ని మూల సూత్రాలతో ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలె. అందుకు ఆయన కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. అవి అ) దేవుడు ఒక్కడి మీద విశ్వాసం (సృష్టికర్త) ఆ) దేవుడికి విశ్వాసికి మధ్యన ఎలాంటి మధ్యవర్తి (పూజారి) అవసరం లేదు. ఇ) నాలుగు వర్ణాల సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించాలె. మనిషి గుణం బట్టి గౌరవం దక్కాలె గాని కులం ఆధారంగా కాదు.

ఈ) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విశ్వాసముండాలె. శతాబ్దాలుగా బ్రాహ్మణాధిపత్యంలో శూద్రులు, అతిశూద్రులకు దక్కకుండాపోయిన కనీస హక్కుల్ని సాధించుకునేందుకు ఈ రాజకీయేతర స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయింది. ఒక కులంలో పుట్టడం మూలంగా గొప్పతనం, మరో కులంలో పుట్టడం మూలంగా తక్కువస్థాయి అనే ప్రచారాన్ని, భావజాలాన్ని ఈ సంస్థ తుత్తునియలు జేసింది.ఈ సంస్థలో చేరే ప్రతి సభ్యుడు తమ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పించాలె. అదీ ఆంగ్ల మాధ్యమంలో. అప్పుడు మాత్రమే చదువుకున్నవారికి తమహక్కులు తెలియడమే గాకుండా నైపుణ్యం కూడా ఏర్పడుతుంది. భగవంతుడు (సృష్టికర్త) భక్తుడికి మధ్యన పూజారి అవసరం లేదంటూ ఈ సంస్థ ప్రచారం చేసింది. మత, సామాజిక కార్యక్రమాల్లో బ్రాహ్మణాధిక్యాన్ని నిరసిస్తూ శూద్ర, అతిశూద్రు భాగస్వామ్యంతో నైతిక సమాజాన్ని నిర్మించడానికి ఇది వుపయోగపడుతుంది. సమాజంలోని అన్ని వర్గాలు, మతాల వారు ఈ ‘సత్యశోధక్ సమాజ్’లో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులు. సమాజ్ భావాల్ని నమ్ముతూ, వాటిని పాటిస్తామని ప్రమాణం చేసే ఎవ్వరైనా ఇందు లో సభ్యులుగా చేరొచ్చు. ముస్లింలు, బ్రాహ్మణులు, ఇతర కులాల వారు ఎవ్వరైనా ఇందులో చేరొచ్చు.

తొలి దశలో ఏడు వందల కుంబి,మాలి, కమ్మరి, కుమ్మరి, రాజ్‌పుత్, బ్రాహ్మణ, ముస్లింలున్నారు. అలాగే లాయర్లు, రైతులు, రైతు కూలీలు, వ్యాపారస్తులు, కూలీలు మొదలైన వృత్తుల వారు కూడా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. ఇందులోని సభ్యులెవరు తమ ఇండ్లల్లో పెండ్లిళ్లు, గృహ ప్రవేశాలు మొదలు కర్మకాండ వరకు బ్రాహ్మణులు లేకుండానే చేసుకున్నారు. బ్రాహ్మణులని పిలువకుండా చేసుకోవడమే ఉద్యమమని బోధించిండు. అలాగని ఆయనకు బ్రాహ్మణుల మీద వ్యక్తిగతంగా కక్షగానీ, కోపంగానీ లేదు. సత్యశోధక్ సమాజ్ కార్యకలాపాల్లో కొంత మంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అలాగే ఫూలే స్వయంగా బ్రాహ్మణ విధవా స్త్రీల కోసం వసతి గృహాన్ని నడిపించాడు. సమాజ్ లక్ష్యాలు, సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రచారం చేసేందుకు కృష్ణారావు భాలేకర్ 1877లో ‘దీనబంధు’ అనే పత్రికను ప్రారంభించాడు.ఈయన సంపాదకత్వంలో ఈ పత్రిక 1880 వరకు వెలువడింది. ఆ తర్వాత పత్రిక బాధ్యతల్ని నారాయణరావు లోఖండే చేపట్టి 1890 వరకు బొంబాయి నుంచి తీసుకొచ్చాడు. ఈ పత్రిక సమాజ కార్యకలాపాల్ని ప్రచారం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది.సమాజ్ నిర్వహణలో ఫూలే సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేసిండు.

కృష్ణారావు భాలేకర్, ఘోలే ఉర్వానే, నాగర్కర్, గణపత్‌రావు పాటిల్, నావల్కర్ తదితరులు పూణే పరిసర ప్రాంతాల్లో సమాజ్ కార్యకలాపాల్ని ప్రచారం చేసిండ్రు. నారాయణ లోఖండే, కాలేకర్, లాడ్ తదితరులు బొంబాయి తదితర ప్రాంతాల్లో కార్మికులు, వెనుకబడిన తరగతులు, కూరగాయలు అమ్మేవారు, నిరక్షరాస్యుల్లో చైతన్యం కలిగించేందుకు పని చేసిండ్రు. మహర్ కులానికి చెందిన గోపాల్‌బువా వలాంజ్కర్ మంచి రచయితే గాకుండా గొప్ప వక్త. ఈయన తన రచనలు, ఉపన్యాసాల ద్వారా సమాజ్ కార్యకలాపాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. 1874 ఆరంభంలో అంటే సంస్థ ఏర్పడిన సంవత్సరం లోపలే బొంబాయిలోని తెలుగు వారు ఫూలేని అక్కడికి ఆహ్వానించారు. రామయ్య అయ్యవారు, నరసింహారావు, జాయ ఎల్లప్ప తదితరులు ఇందులో ప్రధాన భూమిక పోషించారు. సత్యశోధక్ సమాజ్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఫూలే ప్రధానంగా మూడు సూత్రీకరణలు చేసిండు.1. వ్యతిరేకతను వ్యక్తీకరించడం, 2. స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడం, సంఘటితం కావడం, 3. శూద్రులు, అతి శూద్రుల అభ్యున్నతికి నిర్మాణాత్మకమైన కార్యాచరణ

1. వ్యతిరేకతను వ్యక్తీకరించడం: బ్రాహ్మణాధిపత్యాన్ని చాటే ‘పవిత్ర పుస్తకాల’ను నిరసించడం. కులం, మతం ఆధారంగా సమాజంలో అసమానతలు సృష్టించడాన్ని వ్యతిరేకించాడు. శూద్రులు, అతి శూద్రుల్ని శాశ్వత బానిసలుగా మలుచుకునే ఆధిపత్యాన్ని నిరసించిండు. భట్, జోషీ బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నించిండు. 2. స్వీయ అస్తిత్వాన్ని చాటు కోవడం: బహుజన సంస్కృతికి బ్రాహ్మణ సంస్కృతికి మధ్యన స్పష్టమైన విభజన రేఖ గీసిండు. గులాంగిరి, సేద్యకారుడి చర్నాకోల తదితర రచనలు ఇందుకు ఊతమిచ్చాయి. తుకారం తాత్య, బాబా పదంజీ, దడోబా మిసాల్ తదితరులు చేసిన రచనలు కూడా కులాధిపత్యాన్ని ప్రశ్నించాయి. ఆధిపత్యం చలాయించే మీ సంస్కృతి వేరు, అందరినీ కలుపుకొని పోయే మా సంస్కృతి వేరు అని స్పష్టంగా తేల్చి చెప్పిండ్రు. తమ స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడంలో భాగంగా ఖండోబా, బలిరాజా, ఛత్రపతి శివాజీలను ప్రతీకలుగా ప్రతిష్టించిండు. 3. ఆధిపత్యాల్ని నిరసించేందుకు బిసి, దళిత వర్గాలని సంఘటితం చేసిండు. జాతీయ కాంగ్రెస్ పేరిట బ్రాహ్మణాధిపత్యం కొనసాగించడాన్ని నిరసించిండు. 1870లో ఏర్పాటైన ‘సార్వజనీక్ సభ’ కేవలం బ్రాహ్మణుల కోసమే పని చేస్తుందంటూ దానికి వ్యతిరేకంగా ‘దీనబంధు సార్వజనీక్ సభ’ ప్రారంభించిండు. దీని ద్వారా కింది వర్గాల ప్రయోజనాలను రక్షించేవిధంగా వడ్డీ వ్యాపారస్తులు,

బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. భాస్కర జాదవ్ లాంటి వాండ్లు సత్యశోధక్ సమాజ్ తరపున బిసిలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం కొంతమేరకు పోరాటం చేసిండ్రు. బహుజనుల బతుకులు బాగుపడాలంటే వారికి చట్టబద్ధమైన హక్కులుండాలని వాదించిండు. అయితే దురదృష్టవశాత్తు ఆ హక్కులు బిసిలకు ఇప్పటికీ న్యాయంగా దక్కలేదు. జనాభాలో 50 శాతంకు పైగా ఉన్న సమాజానికి ఇప్పటికీ కేవలం 27% అదీ అనేక షరతుల మధ్యన రిజర్వేషన్లు లభిస్తున్నాయి. 1953లో కాకా కాలేల్కర్ కమిటీని బిసిల బతుకుల్ని మెరుగుపరిచేందుకు వేసినట్టే వేసి కుట్ర పూరితంగా దాన్ని అమల్లోకి తేలేదు. 1990 నాటి మండల్ కమిటీ అమలు పాక్షింగానే అయినా మేలు జేసింది. మండల్ నివేదిక 1992 నుండి కొంత మేరకు అమలవుతున్నప్పటికీ ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారు పది శాతానికి మించి లేరు. 30 ఏండ్ల నుంచి అమలు చేస్తున్న ఈ నివేదిక వల్ల కనీసం వారు నిర్దేశించిన 27% ఉద్యోగులు కూడా బిసి వర్గాల నుంచి లేరంటే వాటిని ఎవరు కొల్లగొడుతుండ్రో లెక్క దీయాలె.

బిజెపి ప్రభుత్వం 1990లో మండల్ కమిషన్ అమలుకు వ్యతిరేకంగా అలజడి సృష్టించినట్లే ఇప్పుడు కూడా ప్రధాన మంత్రి పదవికి బిసి ముఖౌటా వేసి బహుజనులందరి మొఖాలకు మసిబూసే యత్నంలో ఉంది. అందుకే బిసి జనగణన బయటపెట్టేందుకు ఈ ప్రభుత్వం జంకుతోంది. న్యాయమైన వాటాను హక్కుగా చట్టబద్ధంగా సాధించుకునేందుకు బహుజనులు సంఘటితం కావాలె. సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో బిసి జనగణన లెక్కల్ని బయటపెట్టాలని (కాంగ్రెస్ పార్టీ చేసిన కుల గణన లెక్కలు) డిమాండ్ చేయడమే గాకుండా, విద్య, ఉద్యోగ, చట్ట సభల్లో ఎవరి జనాభా నిష్పత్తి మేరకు వారికి వాటా కల్పించాలె అని నినదిద్దాం, ప్రభుత్వాల్ని నిలదీద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News