Sunday, April 20, 2025

‘ఫూలే’ సినిమాపై అభ్యంతరం సబబా?

- Advertisement -
- Advertisement -

మనుధర్మం కాలం చెల్లిన ఒక బూజుపట్టిన ధర్మమైతే, భారత రాజ్యాంగం ఆధునిక జీవనానికి దిక్సూచి. మనుధర్మాన్ని ప్రశంసిస్తున్న వాళ్లకి, దానిని రక్షించడానికి పూనుకుంటున్న వాళ్లకి ఇక్కడ పేర్కొన్న అంశాలు తెలుసు. కాని పదే పదే అవే విషయాలను వల్లె వేస్తున్నారు. సమాధుల నుంచి కళేబరాలను లేపాలని చూస్తున్నారు. దానికి వారికి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ సెన్సార్ బోర్డు రాజ్యాంగం ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థ. రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలి. కాని వాళ్లు ఒక వైపు రాజ్యాంగం, ఆధునిక చట్టాల వల్ల పదవులు పొంది, రాజ్యాంగ వ్యతిరేక భావాలను కాపాడాలని చూస్తున్నారు. దానిపైన ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు గళంవిప్పాలి.

భారత దేశంలో ఆధునిక సమాజంలో సామాజిక విప్లవాలకు ఆద్యుడుగా అందరి మన్ననలను అందుకుంటున్న జ్యోతిభా ఫూలే జీవితం భావితరాలకు ఆదర్శం. అటువంటి మహా మనిషిపైన నిర్మించిన చలన చిత్రం భారత ప్రభుత్వ ఆధీనంలోని సెన్సార్ బోర్డు తిరస్కరణకు గురైంది. ఆ చిత్రాన్ని ముందుగా ‘యు’ సర్టిఫికెట్‌తో విడుదలకు అంగీకారం తెలిపి, తర్వాత కొందరి అభ్యంతరాలతో తిరిగి దానికి అభ్యంతరం తెలిపింది సెన్సార్ బోర్డు. అందులో పేర్కొన్న అభ్యంతరాల్లో ప్రధానమైనది ‘మనుధర్మం’పై విమర్శనాత్మకంగా ఉన్న వ్యాఖ్యలని సెన్సార్ బోర్డు ప్రకటించింది. సెన్సార్ బోర్డు చేసిన ఆరోపణ నిజానికి ఎటువంటి సమకాలీన సమాజానికి సరిపోదు.

జ్యోతిభా ఫూలే ఆనాటి ఎందరో పండితుల కన్న, మేధావుల కన్న భిన్నంగా ఆలోచించారు. అందరూ ఆ రోజు సమాజ ప్రగతి గురించి కాక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పాకులాడితే ఫూలే మాత్రం సామాజిక పురోగతికి అడ్డంకిగా ఉన్న కులవివక్ష, అంటరానితనం, మూఢాచారాలకు వ్యతిరేకంగా తన కలాన్ని, గళాన్ని ఎత్తిపట్టి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అందులో భాగంగానే ఫూలే మనుధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సరిగ్గా ఇది నూటయాభై ఏళ్ల క్రితం జరిగిన సత్యశోధక సంఘర్షణ. ఆ తర్వాత మరెందరో సామాజిక ఉద్యమకారులు తమ జీవితాలను ఫణంగా పెట్టి కుల వివక్షను, అంటరానితనాన్ని ప్రతిఘటించారు. అందులో భారత దేశ సామాజిక విప్లవానికి ఒక చట్టరూపం తెచ్చి రాజ్యాంగమనే ఆయుధాన్ని అందించి కుల వివక్షకు, అంటరానితనానికి చట్టపరమైన సమాధి కట్టారు. అప్పటి వరకు ప్రజలు కులాలుగా చీలిపోయి ఎవరికివారే కంచెలు నిర్మించుకుని ఉన్న వ్యవస్థను బద్దలు కొట్టి “భారత ప్రజలమైన మనం” అనే ఒక గొప్ప సమైక్య నినాదాన్ని, ఐక్యత సూత్రాన్ని పీఠికగా మార్చి రాజ్యాంగాన్ని అందించారు. భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. ఎందుకంటే ఎంత రక్తపాతంతో జరిగిన విప్లవమైనా చివరకు ఒక విధాన పత్రాన్ని అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. కాని ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా ఎందరో త్యాగాలతో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న ఆధునిక చరిత్ర భారతదేశం సొంతం. అందుకు నాయకత్వం వహించిన ఆనాటి అనేక మంది నాయకులు, ప్రత్యేకించి రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్‌గా ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి మరువలేనిది.

నిజానికి అప్పటి వరకు ఎన్నో కథలతో, పురాణాలతో, ఇతిహాసాలతో అందులో ప్రత్యేకించి మనుధర్మం ఆవరించిన మూఢాచారాలతో కూడిన సూత్రాలను తోసేసి దాని స్థానంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. భారత రాజ్యాంగం అప్పటి వరకు అన్ని అసమానతలను తొలగించింది. అయితే కొందరు ప్రగతి నిరోధకులు, సామాజిక విప్లవ వ్యతిరేకులు పదే పదే సమాధిలో ఉన్న మనువును తట్టి లేపుతున్నారు. ఏ మాత్రం శాస్త్రీయత, హేతుబద్ధత, నైతికత లేని మనుధర్మాన్ని పదే పదే బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తెలిసి, తెలియని తనంతో మన ధర్మం మనుధర్మమని అజ్ఞానంతో ఊరేగుతున్నారు. మనుధర్మం గొప్ప గ్రంథమని, అది మనిషిని సన్మార్గంలో నడపగలిగే గొప్ప విజ్ఞాన భాంఢాగారమని ఇప్పటికీ ప్రకటిస్తుండడం అటువంటి వారి హ్రస్వదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే ఈ రోజు సమాజం ఎంచుకోవాల్సింది ఏదో ఒకటి. అటు మనుధర్మమా? లేదా భారత రాజ్యాంగమా? రెండూ ఒక చోట, ఒక సమాజంలో మనుగడలో ఉండలేవు. అందుకే ముందుగా మనుధర్మంలో ఏమి ఉందో తెలిసుకుందాం. అన్ని విషయాలను కాక, సమాజం ప్రభావితమయ్యే కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

మనుధర్మం సమాజాన్ని వర్ణాలుగా విడగొట్టింది. అంతేకాకుండా ఒక్కొక్క వర్ణం ఎటువంటి కర్తవ్యాన్ని పాటించాలో చెప్పింది. మనుధర్మంలో ఒకటవ అధ్యాయం, 31వ భాగంలో మనుషుల పుట్టుక గురించి తెలిపింది. బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారని స్పష్టం చేసింది. అదే విధంగా 1వ అధ్యాయం 91వ భాగం ప్రకారం, ఎటువంటి సంకోచం లేకుండా శూద్రులు మిగతా వర్ణాల వారిని శ్రద్ధతో, భక్తితో సేవించాలి.

ఇట్లా, బ్రాహ్మణులు ఎవరినీ తమ ఇంటికి భోజనాలకు పిలువరాదు. శూద్రులు ఎటువంటి చదువు, విద్యను అభ్యసించడానికి వీలు లేదు. బ్రాహ్మణులు లేని ప్రదేశం నివాస యోగ్యం కాదు. అది విధ్వంసక ప్రాంతం. ఇట్లా పదుల సంఖ్యలో కుల వివక్షను, వర్ణ విద్వేషాన్ని పెంచి పోషించే సూత్రాలున్నాయి. చివరకు మహిళల విషయంలో ఎన్నో అవరోధాలున్నాయి. చదువు నేర్చుకోవడానికి వీలులేదనే దగ్గర నుంచి వారి జీవితమే వారి స్వాధీనంలో లేని అంశంగా మనుధర్మం పేర్కొన్నది. చివరకు అంత్యజులనే పేరుతో ఆనాడు అంటరాని వారిగా పేరుపడ్డ దళితులు సొంత ఇల్లు కలిగి ఉండడానికి, భూమి కలిగి ఉండడానికి వీలు లేదు.

శ్మశానంలోనే నివాసముంటూ, శవాల మీది వస్త్రాలను మాత్రమే ధరించాలనే నిబంధనలను మనుధర్మం పేర్కొన్నది. ఇవి కొన్ని మాత్రమే. మనుధర్మం మనుషులను కులాలుగా, వర్ణాలుగా విడగొట్టి, అంతిమంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుషులను విభజించి పాలించే ఒక విధానానికి అంకితమైన గ్రంథం మనుధర్మం. అయితే దానికి భిన్నమైనది భారత రాజ్యాంగం. భారత దేశంలోని ప్రజలందరూ ఒక్కటేననే సమతా భావనకు రాజ్యాంగం ఒక ప్రాతిపదికను అందజేసింది. మనుధర్మాన్ని తిరస్కరించి ఆధునిక ప్రజాస్వామ్య విధానాన్ని అందజేసిన శక్తి భారత రాజ్యాంగానికి ఉంది.

భారత ప్రజలమైన మనం భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటనలో, ఆలోచనధారలో, మత విశ్వాసాలలో, ఆరాధనలో స్వేచ్ఛ, అవకాశాలలో, హోదాల్లో సమానత్వం, అందరిలో పెంపొందించడం. జాతీయ సమైక్యత, సమగ్రత, ఐక్యతలను వృద్ధిచేసి, వ్యక్తుల జీవితాలల్లో గౌరవప్రదమైన స్థితిని అందించడానికి, సోదరత్వాన్ని పాదుకొల్పడమే లక్షంగా ఈ పీఠికను భారత రాజ్యాంగ సభలో 26 నవంబర్, 1949న ఆమోదిస్తున్నాం” ఇది భారత రాజ్యాంగానికి సంక్షిప్త రూపం. భారత రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని అంశాలకు ఇది ఒక ముఖ ద్వారం. ఉపోద్ఘాతం.

ఇక్కడ మనం మనుధర్మాన్ని, భారత రాజ్యాంగాన్ని ఒక చోట చూశాం. మనుధర్మం కాలం చెల్లిన ఒక బూజుపట్టిన ధర్మమైతే, భారత రాజ్యాంగం ఆధునిక జీవనానికి దిక్సూచి. మనుధర్మాన్ని ప్రశంసిస్తున్న వాళ్లకి, దానిని రక్షించడానికి పూనుకుంటున్న వాళ్లకి ఇక్కడ పేర్కొన్న అంశాలు తెలుసు. కాని పదే పదే అవే విషయాలను వల్లె వేస్తున్నారు. సమాధుల నుంచి కళేబరాలను లేపాలని చూస్తున్నారు. దానికి వారికి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ సెన్సార్ బోర్డు రాజ్యాంగం ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థ. రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలి. కాని వాళ్లు ఒక వైపు రాజ్యాంగం, ఆధునిక చట్టాల వల్ల పదవులు పొంది, రాజ్యాంగ వ్యతిరేక భావాలను కాపాడాలని చూస్తున్నారు. దానిపైన ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు గళంవిప్పాలి. ఆధునిక సమాజం పురోగమనంలో మొదటి జెండా ఎత్తిన జ్యోతిభా ఫూలే జీవిత చరిత్రను చిత్రరూపంలో అడ్డుకోవాలని చూడడం కేవలం భ్రమమాత్రమే. ఆ ఫూలే జీవితం కోటాను కోట్ల ప్రజల గుండెల్లో ఏనాడో చేరిపోయింది.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News