తాత్కాలిక పద్దతిలో సిబ్బంది ఏర్పాట్లు
13 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన వైద్యశాఖ
రోగుల సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రయత్నాలు వేగం
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీదవఖానల్లో తాత్కాలిక పద్దతిన వైద్యులను నియమించేందుకు జిల్లా వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 12వ తేదీ మంగళవారం ఆసక్తిగల అభ్యర్ధులు ఇంటర్వూకు హాజరుకావాలని అధికారులు సూచించారు. నియమితులైన వారికి నెలకు రూ. 42వేల వేతనం అందిస్తామని, పేదలకు సేవలందించేందుకు వైద్యులు ముందుకు రావాలని కోరారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పత్రాలు పొంది పూరించిన దరఖాస్తులు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 256 బస్తీ దవఖానాల ద్వారా పేద ప్రజలకు వైద్య చికిత్సలందిస్తున్నారు.
ఒక దవాఖానలో ఒక వైద్యుడు, నర్సు, ఒక సహాయకురాలు ఉండగా వీరు రోజుకు 80 నుంచి 100మందికి సేవలందిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దవఖానల్లో నాణ్యమైన వైద్యం అందించడంతో చాలామంది కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వం ఆసుపత్రులకు రావడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు సరిపోకపోవడంతో తాత్కాలిక పద్దతిని 13 మందిని నియమిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే నెలల్లో నూతన బస్తీదవఖానలు రోగులకు అందుబాటులో ఉంటాయని, పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి అవసరం లేదంటున్నారు. అదే విధంగా వ్యాధి నిర్దారణ కోసం ప్రస్తుతం 08 డయాగ్నస్టిక్ హబ్‌ల ద్వారా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. మరో 08 డయాగ్నస్టిక్ హబ్‌లు కూడా జూన్‌లోగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు.
మొత్తం 300 వరకు బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రభుత్వ టార్గెట్ పెట్టగా కొత్త వాటితో మూడొంతల వరకు బస్తీ దవఖానలు ఏర్పాటు చేసినట్లు, ఏడాది చివరి నాటికి పూర్తికి ఏర్పాటు చేసి ఆరోగ్య హైదరాబాద్ నగరానికి పేరు ప్రతిష్టలు చేస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బస్తీదవఖానల పనితీరుపై ఐదేళ్ల కితం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించి ఉత్తమ అవార్డు అందజేసి, దేశంలోని వివిధ రాష్ట్రాలు బస్తీదవఖానలపై అధ్యయనం చేయాలని సూచనలు చేసింది. బస్తీ దవాఖానాల ఏర్పాటు ద్వారా వైద్యఖర్చులు తగ్గి పేదల ఆర్దిక వ్యవస్ద మెరుగుపడిందని వైద్య రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.