వైద్యరంగంలోమరో అరుదైన ప్రయోగం బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరంలో పంది కాలేయాన్ని అమర్చారు. ఈ మేరకు చైనా వైద్యులు ప్రకటించారు. భవిష్యత్తులో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. మానవశరీరంలోకి సరిపోయేలా జన్యు సవరణలు చేసిన ఓ పంది కాలేయాన్ని వైద్యులు సేకరించారు. బ్రెయిన్ డెడ్ అయిన మానవ శరీరం లోకి దాన్ని మార్పిడి చేశారు. గతం లోనూ అమెరికా వైద్యులు పంది మూత్ర పిండాలు, గుండెను విజయవంతంగా అమర్చారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కాలేయ దాతలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిణామాల దృష్టా వైద్యులు మానవులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కల్పించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. “ జన్యు సవరణలు చేసిన పందుల అవయవాలను , తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించే అవకాశం ఉంటుంది.
మళ్లీ మానవ కాలేయం దాత దొరికేంతవరకు ఆ రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది. 10 రోజుల పాటు ఆ వ్యక్తి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. పంది కాలేయం పనితీరు, మానవ శరీరం ప్రతిస్పందనను మా వైద్య బృందం పరిశీలిస్తుంది. ఇప్పటివరకు కాలేయం పనితీరు సక్రమంగా జరుగుతోంది ” అని చైనా లోని జియాన్‌లో నాల్గవ మిలిటరీ మెడికల్ యూనివర్శిటీ వైద్యులు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి ఈ ప్రయోగం ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఓ వ్యక్తికి అమెరికా వైద్యులు పంది గుండెను విజయవంతంగా అమర్చారు. సర్జరీ తర్వాత అతడు 40 రోజుల వరకు బాగానే ఉన్నారు. అనంతరం ఆ గుండె వైఫల్యం చెందడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా చైనా వైద్యులు చేసిన ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది.