దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్
నిష్పాక్షిక, పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ పిటిషన్
నేలపాడు(అమరావతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు, వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సిబిఐ, ఈడిలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ సహా మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపి ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగు రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు తదితర స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ, ఈడిలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సిబిఐ, ఈడికి అప్పగించాలని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచీ డిజిపి, సిఐడి అదనపు డిజి తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో సిఐడి, ఈడి ఇప్పటివరకూ చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసుల దర్యాప్తును సిబిఐ, ఈడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.