Tuesday, January 14, 2025

త్రివేణి సంగమానికి ప్రపంచ యాత్రికులు

- Advertisement -
- Advertisement -

‘మోక్షం’ సాధించేందుకు త్రివేణి సంగమంలో సోమవారం పవిత్ర స్నానం చేసిన జన సందోహంలో అనేక మంది విదేశీ సందర్శకులు కూడా ఉన్నారు. పుష్య పౌర్ణమి నాడు ‘షహీ స్నాన్’తో సోమవారం మొదలైన మహా కుంభమేళా గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశాన్ని విశ్వాసం, సంస్కృతి, మానవాళి సమ్మిశ్రమంగా మార్చివేసింది. 144 ఏళ్లకు ఒకసారి సంభవించే అరుదైన ఖగోళ సమీకరణాన్ని అనుభవించేందుకు ప్రపంచ యాత్రికులు కూడా వచ్చారు. సాధువుగా మారి ‘బాబా మోక్షపురి’గా ఇప్పుడు పేర్కొంటున్న మాజీ యుఎస్ జవాన్ మైకేల్ తన పరివర్తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. ‘ఒక కుటుంబంతో గడుపుతూ, కెరీర్ సాగిస్తున్న ఒక సామాన్య వ్యక్తిని. అయితే, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గ్రహించాను, దానితో మోక్షం కోసం అన్వేషణకు బయలుదేరాను’అని ఆయన చెప్పారు. జునా అఖాడాతో సంబంధం ఉన్న మైకేల్ సనాతన ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేశారు.

‘ఇది ప్రయాగ్‌రాజ్‌లో నా తొలి మహా కుంభమేళా. ఆధ్యాత్మిక భావనలు అసాధారణమైనవి’ అని మైకేల్ పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి ఆకర్షితులైనవారిలో ఉత్సవాన్ని చిత్రీకరిస్తున్న దక్షిణ కొరియా యూట్యూబర్లు, యూరోపియన్ యాత్రికులతో పాటు సంప్రదాయాల గురించి తెలుసుకుంటున్న జపాన్ యాత్రికులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం వైభవానికి స్పెయిన్‌కు చెందిన క్రిస్టినా విస్మయం వ్యక్తం చేస్తూ, ‘ఇది ఒక అద్భుత క్షణం. ఇటువంటిది నేను ఎన్నడూ చూడలేదు’ అని చెప్పారు. మరొక అంతర్జాతీయ సందర్శకురాలు జూలీ త్రివేణి సంగమంతో ప్రగాఢ అనుబంధం ఉన్నదనే భావన వ్యక్తం చేశారు. ‘ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞురాలిని. నా కల నెరవేరింది’ అని ఆమె ‘పిటిఐ వీడియోస్’తో చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వలెరియా ఈ వాతావరణాన్ని ‘ఉత్సుకత కలిగించేది, పూర్తిగా సద్భావనలతో కూడినది’గా అభివర్ణించారు. అయితే, ఆమె, ఆమె భర్త మైఖేల్ చల్లగా వణికించే నీరు కారణంగా ‘షహీ స్నాన్’కు దూరంగా ఉన్నారు.

‘నీరు బాగా చల్లగా ఉన్నందున నేను నీటిలోకి వెళ్లినట్లయితే నన్ను వదలివేస్తానని నా భార్య బెదరించింది’ అని మైఖేల్ చమత్కరించారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి రావాలని ఆ దంపతులు యోచిస్తున్నారు. మోక్షం అన్వేషణలో మహా కుంభమేళాకు మొదటిసారిగా వచ్చిన బ్రెజిల్ యోగ సాధకుడు షికు ‘భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం. 144 ఏళ్ల తరువాత సంభవిస్తున్నందున ఈ మహా కుంభమేళా మరింత ప్రత్యేకం అవుతోంది. ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. జై శ్రీరామ్’ అని అన్నారు. ఇక ఫ్రాన్స్ నుంచి వచ్చిన మెలానీకి మహా కుంభమేళా ఊహించని థ్రిల్. ‘నేను భారత్‌కు నా పర్యటనను ప్లాన్ చేసినప్పుడు మహా కుంభమేళా గురించి తెలియదు. కానీ, దీని గురించి నేను విన్న తరువాత ఇక్కడికి వచ్చాను. సాధువులను కలుసుకోవడం, చైతన్యవంతమైన ఈ ఉత్సవాన్ని వీక్షించడం జన్మలో ఒక్కసారే లభించే అనుభవం’ అని ఆమె ‘పిటిఐ వీడియోస్’తో అన్నారు. పలువురు విదేశీ సందర్శకులు కూడా ఈ ఉత్సవం ప్రపంచ ఖ్యాతి గురించి ప్రస్తావించారు. ‘ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు మహా కుంభమేళా గురించి, ముఖ్యంగా దీని గురించి తెలుసు. ఎందుకంటే 144 ఏళ్లలో ఇదే అతిపెద్దది’ అని ఔత్సాహిక సందర్శకుడు ఒకరు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News