ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేని భక్తులకు కూడా శబరిమల ఆలయంలో అయ్యప్పస్వామి దర్శనం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం స్పష్టం చేశారు. రానున్న మండలం-మకరవిళక్కు సీజన్‌లో శబరిమలను సందర్శించే భక్తులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం ఉంటుందని ఇదివరకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేని భక్తులకు కూడా సులభంగా స్వామివారి దర్శనం లభించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం గురించి అవగాహన లేకుండా నేరుగా దర్శనానికి వచ్చే భక్తులకు సైతం ఆలయ ప్రవేశం ఉంటుందని ఆయన వివరించారు. గత యాత్రా సీజన్‌లో కల్పించిన విధంగానే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ఏడాది ఆన్‌లైన్ బుకింగ్‌తోపాటు స్పాట్ బుకింగ్ కూడా ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అదే తరహాలో ఉంటుందా అన్న విషయమై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు.