సిబిఐ దర్యాప్తు కోరిన మాజీ సిపి పరమ్ బీర్
ముంబయి: బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేను ఆదేశించిన మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్‌ముఖ్‌పై వెంటనే నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ గురువారం బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దేశ్‌ముఖ్‌పై చర్యలు కోరుతూ గతవారం పరమ్ బీర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయపడిన కోర్టు దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించాలని బుధవారం ఆయనకు సూచించింది.
వాజేతో సహా ముంబయికి చెందిన పలువురు సీనియర్ పోలీసు అధికారులతో దేశ్‌ముఖ్ గత నెల తన నివాసంలో అనేక సమావేశాలు నిర్వహించారని, వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆయన ఈ సమావేశాలలో పోలీసు అధికారులను ఆదేశించారని బాంబే హైకోర్టులో దాఖలు చేసిన తన పిల్‌లో సింగ్ ఆరోపించారు. పోలీసుల విధినిర్వహణలో దేశ్‌ముఖ్ తరచు జోక్యం చేసుకునేవారని, అనేక సార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దేశ్‌ముఖ్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. మంత్రిపై తక్షణ, నిష్పాక్షిక, ఒత్తిడిలేని, నిజాయితీతో కూడిన దర్యాప్తు కోసం సిబిఐని ఆదేశించాలని సింగ్ తన పిల్‌లో కోరారు.